అది 2004.. బౌలర్లకు స్వర్గధామం లాంటి ఫైసలాబాద్ పిచ్.. పాకిస్థాన్, శ్రీలంక మధ్య తొలి టెస్టు.. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ పాక్ పేసర్లు షోయబ్ అక్తర్ (5/60), మహమ్మద్ సమి (4/71) విజృంభించడం వల్ల మొదట బ్యాటింగ్ చేసిన లంక.. తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు కుప్పకూలింది. సమరవీర (100) శతకంతో జట్టును ఆదుకున్నాడు. బదులుగా పాక్ 264 పరుగులు చేసి 21 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని దక్కించుకుంది. మూడో రోజు నుంచి పిచ్ బౌలింగ్‌కు మరింత సహకరించడం మొదలెట్టింది. బ్యాటింగ్ కష్టమైన ఆ పిచ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఏ మేరకు పోరాడుతుందోనని అందరూ అనుకున్నారు. కానీ తన ఆటతో జయసూర్య సృష్టించే సునామీని ఎవరూ అంచనా వేయలేకపోయారు. మొదట సంగక్కర (59), జయవర్దనె (57)లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చిన అతను.. ఆ తర్వాత వరుస వికెట్లు పడుతున్నా ఓ వైపు పట్టుదలగా నిలబడి పోరాటం కొనసాగించాడు. సుమారు ఎనిమిది గంటలకు పైగా క్రీజులో గడిపి 348 బంతుల్లో 253 పరుగులు చేసి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. తన ఇన్నింగ్స్‌లో అతను కొట్టిన 33 ఫోర్లు, 4 సిక్సర్లు వేటికవే ప్రత్యేకం. అతడి జోరుతో రెండో ఇన్నింగ్స్‌లో 438 పరుగులు చేసిన లంక.. పాక్ ముందు 418 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో పాక్ 216 పరుగులకే పరిమితమైంది.
35 ఏళ్ల వయసులో జయసూర్య ఆడిన ఈ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పరుగుల దాహం తీరని యువకుడిలా అతడు చెలరేగాడు. మ్యాచ్ మూడో రోజు ఉదయం మొదలైన జయసూర్య తుపాను.. నాలుగో రోజు చివరి వికెట్‌గా వెనుదిరిగే వరకూ పాక్‌ను అతలాకుతలం చేసి.. ఆఖరుకు నిలువునా ముంచెత్తింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచే అతని బాదుడు మొదలైంది. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అక్తర్ బౌలింగ్‌లో ఔటైనా.. అది నోబాల్ కావడంతో బతికిపోయిన జయసూర్య ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఆ నోబాల్ వేసినందుకు అక్తర్ ఎప్పటికీ చింతించేలా అతడి ఊచకోత సాగింది.
అక్తర్, సమి, అబ్దుల్ రజాక్ లాంటి పేసర్లకు ఎదురొడ్డి.. డానిష్ కనేరియా, షోయబ్ మాలిక్‌ల స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొని తన జోరు కొనసాగించాడు జయసూర్య. పేసర్లు ఆఫ్ స్టంప్‌కు దూరంగా వేసిన బంతులను కవర్ లేదా పాయింట్ దిశగా.. వికెట్లకు నేరుగా వేసిన బంతులను మిడ్ వికెట్, స్క్వేర్ లెగ్ దిశగా తరలించాడు. షార్ట్‌పిచ్ బంతులను అదే వేగంతో బౌండరీ దాటించాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో అయితే స్వీప్ షాట్లతో ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. వికెట్ల ముందుకొచ్చి అమాంతం బంతిని స్టాండ్స్‌లో పంపించాడు. పేసర్, స్పిన్నర్ అనే తేడా చూపకుండా.. అందరినీ నిర్దాక్షిణ్యంగా శిక్షించాడు. ఎక్కడ బంతులు వేయాలో తెలీక బౌలర్లు తలలు పట్టుకుంటే.. అసలు బంతిని ఆపే పనే లేని ఫీల్డర్లు ఆ విధ్వంసానికి సాక్ష్యంగా నిలిచారు.
లాంగాన్‌లో భారీ సిక్సర్‌తో అతను శతకాన్ని (164 బంతుల్లో) అందుకోవడం విశేషం. సెంచరీ తర్వాత జయసూర్య మరింత జోరు పెంచాడు. కళ్లుచెదిరే కవర్‌డ్రైవ్స్‌తో ఆకట్టుకున్నాడు. పాక్ జట్టు ఫీల్డర్లను ఆఫ్‌సైడ్ మోహరించి.. అటువైపే బంతులేసినప్పటికీ తెలివిగా వ్యవహరించి లెగ్‌సైడ్ ఆడి బౌండరీలు రాబట్టాడు. ఓ వైపు సహచరులు ఒక్కొక్కరే పెవిలియన్ చేరుతున్నప్పటికీ జయసూర్య జోరు ఆగలేదు. షార్ట్ పిచ్ బంతులు, బౌన్సర్లతో అక్తర్ పరీక్షించినా జయసూర్య బెదరలేదు. దీటుగా బదులిచ్చాడు. ద్విశతకాన్ని (301 బంతుల్లో) కూడా అతను సిక్సర్‌తోనే పూర్తి చేశాడు. అక్తర్ బౌలింగ్‌లో నటరాజ్ షాట్‌తో స్క్వేర్‌లెగ్ వైపు కొట్టిన ఆ సిక్సర్ చూసి తీరాల్సిందే. అక్కడి నుంచి ఆ తుపాను తీవ్రరూపం దాల్చింది. అక్తర్ వేసిన ఓ ఓవర్లో అయిదు బంతుల్లో నాలుగు ఫోర్లు కొట్టాడు. 200 నుంచి 250 పరుగులు చేరేందుకు జయసూర్య కేవలం 41 బంతులే తీసుకున్నాడంటే అతడి విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. శ్రీలంకను పటిష్ఠ స్థితిలో నిలిపిన జయసూర్య చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.
బ్యాట్స్‌మన్ : సనత్ జయసూర్య