తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచకప్​లో వైఫల్యంతో కోచ్​లపై శ్రీలంక వేటు..!

ఇంగ్లాండ్​లో ఇటీవల ముగిసిన ప్రపంచకప్​లో లీగ్​ దశలోనే ఇంటిముఖం పట్టింది శ్రీలంక జట్టు. మెగాటోర్నీలో ఆశించిన ఫలితం సాధించనందుకు కారణంగా ఆ దేశ జాతీయ జట్టు కోచ్ హతురుసింగ​ సహా పలువురిని తొలగించేందుకు క్రీడా శాఖ మంత్రి నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రపంచకప్​ ఓటమికి బాధ్యులుగా కోచ్​లపై శ్రీలంక వేటు..!

By

Published : Jul 20, 2019, 6:51 AM IST

ప్రపంచకప్​లో లీగ్​ దశలోనే శ్రీలంక జట్టు ఇంటి ముఖం పట్టడం వల్ల ఆ దేశ క్రీడా మంత్రి చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. మెగాటోర్నీలో 9 మ్యాచ్​లు ఆడిన లంకేయులు మూడు విజయాలు మాత్రమే సాధించారు. ఈ పరాభవానికి కారణంగా లంక జట్టు ప్రధాన కోచ్​ చందిక హతురుసింగ సహా అతడి అసిస్టెంట్లపై వేటు పడనుంది. త్వరలో బంగ్లాదేశ్​తో జరగనున్న వన్డే సిరీస్​ తర్వాత వీరు పదవుల్లో కొనసాగడంపై అనిశ్చితి నెలకొంది. ఆ దేశ క్రీడా మంత్రి హరిన్​ ఫెర్నాండో ఈ మేరకు ఆదేశాలిచ్చారట.

కెప్టెన్​ దినేశ్​ చండిమల్​తో కోచ్ హతురుసింగ​ (క్రీడా శాఖ మంత్రి హరిన్​ ఫెర్నాండో)

హతురుసింగకు మరో 16 నెలల కాలం వరకు కాంట్రాక్టు ఉంది. అయితే అది ముగియకుండానే చర్యలు తీసుకొనే అవకాశం ఉందట. 2017 డిసెంబర్​లో హతురుసింగ శ్రీలంక జట్టు ప్రధాన కోచ్​గా నియామకం అయ్యాడు. గతంలో బంగ్లాదేశ్​ జట్టుకు మూడేళ్లు సేవలందించాడు. ఇతడి పర్యవేక్షణలోనే ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియాపై లంకేయులు టెస్టు సిరీస్​లో విజయాలు సాధించారు. ఫీల్డింగ్​ కోచ్​ స్టీవ్​ రిక్షన్​, బ్యాటింగ్​ కోచ్​ జాన్​ లూయిస్​, ఫాస్ట్​ బౌలింగ్​ కోచ్​ రుమేశ్​ రత్నాయక్​ల కాంట్రాక్టులు ముగిసినా ఇప్పటివరకు పొడిగించకపోవడం గమనార్హం.

తొలి జట్టు బంగ్లా...

ప్రస్తుతం బంగ్లాదేశ్​ జట్టు శ్రీలంకలో వన్డే సిరీస్​ ఆడనుంది. జులై 26 నుంచి ఆగస్ట్​ 1 వరకు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్​లు జరగనున్నాయి. ఏప్రిల్​ 21న శ్రీలంకలో భీకరమైన బాంబు దాడిలో 258 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత మళ్లీ ఆ దేశంలో అడుగుపెట్టిన విదేశీ జట్టు బంగ్లాదేశ్​.

ABOUT THE AUTHOR

...view details