ఏడేళ్ల నిషేధం తర్వాత దేశవాళీ క్రికెట్లోకి అడుగుపెట్టిన టీమ్ఇండియా పేసర్ శ్రీశాంత్ తొలి వికెట్ పడగొట్టాడు. సోమవారం ప్రారంభమైన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కేరళ తరఫున బరిలో దిగాడు. పుదుచ్చేరి ఆటగాడు ఫబీద్ అహ్మద్‌ను ఔట్ చేశాడు. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మైదానంలో పరుగెడుతూ ఆకాశం వంక చూస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఎన్నో ఏళ్ల తర్వాత తీసిన తొలి వికెట్ ఆనందాన్ని తన సహ ఆటగాళ్లతో కలిసి పంచుకున్నాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
2013 ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా శ్రీశాంత్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జీవితకాల నిషేధం విధించింది. ఆ తర్వాత శ్రీశాంత్ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా నిషేధాన్ని ఏడేళ్లకు కుదించింది. అదికాస్త ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసింది. పుదుచ్చేరితో మ్యాచ్‌లో ఇతడు నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసి 29 పరుగులు ఇచ్చాడు.