కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మరణం యావత్ దేశాన్ని కుదిపేసింది. ఆమెకు సంతాపం తెలిపారు క్రీడా ప్రముఖులు. విరాట్ కోహ్లీ, కిరణ్ రిజిజు, గౌతమ్ గంభీర్ తదితరులు ఆమెకు నివాళి తెలిపారు.
"సుష్మా జీ మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె ఆత్మకు ప్రశాంతత కలగాలని కోరుకుంటున్నా" -కోహ్లీ, టీమిండియా కెప్టెన్
"ఈ సమయంలో నాకు మాటలు రావటం లేదు. ఆమె నిజాయితీగా దేశం కోసం పనిచేశారు. సుష్మాజీ! మీరు ఎల్లప్పుడూ మా హృదయంలో, ఆలోచనలలో ఉంటారు" -కిరణ్ రిజిజు, క్రీడా మంత్రి.
"సుష్మా మరణంతో షాక్ అయ్యాను. 50 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎంతో మంది హృదయాల్లో నిలిచిపోయారు. విదేశాంగ మంత్రిగా ఆమె సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి" -రాజవర్ధన్ సింగ్ రాఠోడ్, మాజీ క్రీడా మంత్రి.
"సుష్మా స్వరాజ్ కన్నుమూసినందుకు చాలా బాధగా ఉంది. ప్రముఖ రాజకీయ నాయకురాలిగా, భాజపా నేతగా అందరి ప్రేమను అందుకున్నారు. ఆమె కుటుంబానికి, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి. ఆమె మరణం భారత్‌కు తీరని నష్టం" - గౌతమ్ గంభీర్, మాజీ క్రికెటర్
"సుష్మా స్వరాజ్ జీ కుటుంబానికి, అభిమానించే వారికి హృదయపూర్వక సానుభూతి తెలుపుతున్నా" -భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్
"నాకు ఎంతో ఇష్టమైన సుష్మా స్వరాజ్ మృతి చెందినందుకు షాక్ అయ్యాను. ఆమె ఆలోచనలతో 'గర్ల్ చైల్డ్' ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశాను. ఆమెతో నా అనుబంధాన్ని ఎప్పటికీ మరచిపోలేను." -టెన్నిస్ స్టార్ సానియా మీర్జా
"ఈ రోజు పేపర్లో హెడ్లైన్ చూసి షాక్ అయ్యా. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి సుష్మా జీ. గొప్ప నాయకురాలు, బలమైన మహిళ. ఆమెను భారతీయులు ఎంతగానో మిస్ అవుతారు." -హీనా సిద్ధు, షూటర్
"నిజమైన నాయకురాలు, ప్రజల మనిషి సుష్మ. వార్తల్లో ఈ విషయం చూసి నమ్మలేకపోయా. చాలా బాధపడ్డా! ఆత్మకు శాంతి కలగాలి." -సురేశ్ రైనా, క్రికెటర్
గత కొద్ది రోజులుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న సుష్మ.. మంగళవారం అస్వస్థతకు గురై దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. 67 ఏళ్ల వయసులోనే తుదిశ్వాస విడిచారు సుష్మ.
ఇది చదవండి: శక్తిమంతమైన మహిళకు సినీ లోకం అశ్రు నివాళి