తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆటగాళ్లు ఎన్​సీఏకు తప్పనిసరిగా వెళ్లాల్సిందే: గంగూలీ

ఆటగాళ్లు గాయం నుంచి కోలుకునేందుకు ఎన్​సీఏకు వెళ్లాల్సిందేనని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పష్టం చేశాడు. అన్ని సౌకర్యాలు సర్దుబాటు చేసి ఆటగాళ్లకు ఇబ్బందిలేకుండా చూస్తామని చెప్పాడు.

Spoke to Rahul Dravid, players will have to go to NCA for rehabilitation: Sourav Ganguly
సౌరభ్ గంగూలీ

By

Published : Jan 2, 2020, 9:09 AM IST

గాయం నుంచి కోలుకోవడానికి ప్రతి ఆటగాడూ జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కు వెళ్లాల్సిందేనని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. ఎన్‌సీఏలో సౌకర్యాలను వాడుకోవడానికి భారత బౌలర్లు కాస్త సందేహిస్తుండడంపై స్పందించిన దాదా.. అన్నింటీని సర్దుబాటు చేస్తామని చెప్పాడు.

"నేను రాహుల్‌ ద్రవిడ్‌ను కలిశాను. ఎన్‌సీఏలో ఓ వ్యవస్థను ఏర్పాటు చేశాం. బౌలర్లు ఎన్‌సీఏకు వెళ్లాల్సిందే. ఎవరైనా వాళ్లకు చికిత్స చేయాలనుకుంటే ఎన్‌సీఏకు వెళ్లాలి" -సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

బౌలర్ల ఇబ్బంది ఎన్‌సీఏ శిక్షణ సిబ్బందితోనా లేదా అక్కడి సౌకర్యాలతోనా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. కారణమేదైనా మేం అన్నింటినీ సర్దుబాటు చేస్తామని, ఆటగాళ్లు సౌకర్యంగా ఉండేలా చూస్తామని అన్నాడు. అత్యాధునిక సౌకర్యాలతో కొత్త స్థలంలో ఎన్‌సీఏ నిర్మాణం త్వరలో ఆరంభిస్తామని చెప్పాడు

ద్రవిడ్​తో గంగూలీ

నాలుగు దేశాల టోర్నీపై..

ప్రతిపాదిత నాలుగు దేశాల టోర్నమెంట్‌కు ఐసీసీ, ప్రసారదారు నుంచి అనుమతి రావాల్సి ఉందని గంగూలీ చెప్పాడు. భవిష్యత్ పర్యటన ప్రణాళిక (ఎఫ్‌టీపీ)లో ఎక్కడ ఖాళీ ఉందో కూడా చూడాలని అన్నాడు.

"నాణ్యమైన క్రికెట్‌ను అందించాలన్నది మా ఉద్దేశం. ప్రస్తుతం కేవలం ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రమే జరుగుతున్నాయి. జనం ఓ అత్యున్నత స్థాయి టోర్నమెంట్‌ను చూడాలనుకుంటున్నారు. దాని కోసమే మేం ప్రయత్నిస్తున్నాం. పింక్‌ బాల్‌ టెస్టు కూడా స్టేడియాలకు జనాన్ని రప్పించాలన్న ప్రయత్నంలో భాగమే. నాలుగు దేశాల టోర్నీలో భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లు మూడు జట్లు కాగా.. మరో జట్టును ఎంచుకోవాల్సి ఉంది. దాని కోసం ప్రయత్నం జరుగుతోంది. బలమైన జట్టును ఎంచుకుంటాం" -సౌరభ్​ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

ఆస్ట్రేలియాలో వార్షిక బాక్సింగ్‌ డే టెస్టుకు జనం నుంచి భారీ స్పందన లభిస్తున్న నేపథ్యంలో భారత్‌కూ అలా ఓ టెస్టు ఉండాలన్న అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా అన్న ప్రశ్నకు.. ఆ దిశగా పని చేయాల్సి ఉందని బదులిచ్చాడు.

"బాక్సింగ్ డే టెస్టులా ఇక్కడ కూడా ఆ దిశగా పనిచేయాల్సి ఉంది. అప్పుడే ప్రజల్లో ఆసక్తి పెరుగుతుంది. అదే న్యూజిలాండ్‌.. ఆస్ట్రేలియాతో ఎక్కడో, మరేదో రోజు ఆడితే అంత ఆసక్తి కలగకపోవచ్చు. కానీ బాక్సింగ్‌ డే జనాన్ని ఒక్క దగ్గరికి చేరుస్తుంది. కాబట్టి ఈవెంట్లు సృష్టించడం ముఖ్యం. పింక్‌ బాల్‌ టెస్టు ఒక ఈవెంట్‌. ఇకపై ప్రపంచ వ్యాప్తంగా అది జరుగుతుంది. కోల్‌కతాలో జరిగింది. ముంబయి, బెంగళూరు, గుజరాత్‌లో కూడా జరుగుతుంది. దాని వల్ల ప్రేక్షకులు తిరిగి మైదానాల బాట పడతారు." -సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

ఈ నెల 5 నుంచి శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది టీమిండియా. అనంతరం ఆస్ట్రేలియాతోనూ తలపడనుంది. ఈ నెలాఖరు నుంచి న్యూజిలాండ్​లో పర్యటించనుంది భారత్.

ABOUT THE AUTHOR

...view details