తెలంగాణ

telangana

ETV Bharat / sports

మరపురాని మెరుపులు: లంకపై 'వీర' బాదుడు

టెస్టు మ్యాచ్‌లో ఒక రోజు వ్యవధిలో ఓ జట్టు 284 పరుగులు చేస్తే అది మంచి స్కోరే. 90 ఓవర్లలో మూడుకు పైగా రన్‌రేట్‌తో పరుగులు చేస్తే బాగా ఆడినట్లే. మరి ఓ టెస్టు మ్యాచ్‌లో ఒక రోజులో ఓ జట్టు 79 ఓవర్లు మాత్రమే ఆడగా.. ఆ 79 ఓవర్లలోనే ఓ ఆటగాడు 284 పరుగులు చేస్తే..? ఇలా నిజంగా జరిగిందా.. టెస్టు మ్యాచ్‌లో అదెలా సాధ్యం.. అంటారా? అయితే 2009 డిసెంబరు 3న ఏం జరిగిందో తెలుసుకుందామా.

special story on virendra sehwag
వీరూకి తప్ప ఈ ఘనత ఎవరికైన సాధ్యమా!

By

Published : May 13, 2020, 6:47 AM IST

మూడు టెస్టుల సిరీస్‌ కోసం 2009 చివర్లో భారత పర్యటనకు వచ్చింది శ్రీలంక. అప్పటికి టీమ్‌ఇండియా భీకర ఫామ్‌లో ఉంది. సొంతగడ్డపై అదరగొడుతూ.. విదేశాల్లోనూ సత్తా చాటి.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని తొలిసారి అందుకోవడానికి అడుగు దూరంలో ఉంది. సంగక్కర, జయవర్దనె, మురళీధరన్‌, దిల్షాన్‌ లాంటి మేటి ఆటగాళ్లున్న్పటికీ భారత్‌ ధాటికి లంక నిలవలేదనే అంతా అనుకున్నారు. కానీ లంక పోరాడింది. ఒక టెస్టు ఓడినా.. మరో టెస్టును డ్రాగా ముగించింది.

ముంబయిలో చివరిదైన మూడో టెస్టు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన లంక తొలి రోజు బాగానే ఆడింది. దిల్షాన్‌ (109), మాథ్యూస్‌ (99) సత్తా చాటడం వల్ల ఆట ఆఖరుకు 366/8తో నిలిచింది. రెండో రోజు 393కి ఆలౌటైంది. ఉన్నంతలో అది మంచి స్కోరే. భారత్‌ ఎంత బాగా ఆడినా.. ఆ స్కోరును అధిగమించి ఆధిక్యంలోకి రావాలంటే తర్వాతి రోజు మధ్యాహ్నం వరకైనా పడుతుందని అంచనా. కానీ రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 443/1. అంటే.. ఆధిక్యం 50 పరుగులన్నమాట. ఇదంతా వీరేంద్ర సెహ్వాగ్‌ విధ్వంస మహిమ!

ఆరు గంటల ఆరు నిమిషాల సమయం.. 254 బంతులు.. 40 ఫోర్లు.. 7 సిక్సర్లు.. 293 పరుగులు. ఇవీ వీరేంద్రుడి విధ్వంసానికి సంబంధించిన గణాంకాలు. ఉదయం ఆట ఆరంభమైన నలభై నిమిషాలకు క్రీజులోకి వచ్చిన అతను.. సాయంత్రం ఆట ఆఖరుకు అజేయంగా 284 పరుగులకు చేరుకోవడం క్రికెట్‌ చరిత్రలోనే ఓ పెను సంచలనం. ఫార్మాట్‌ ఏదైనా.. ప్రత్యర్థి ఏదైనా.. పరిస్థితులు ఎలా ఉన్నా.. తన ఆట తనదే అన్నట్లు ఆడే వీరూ ఆ రోజు బ్రబౌర్న్‌ స్టేడియంలో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై లంక బౌలర్లను మామూలుగా ఏడిపించలేదు. మురళీధరన్‌ లాంటి దిగ్గజ స్పిన్నరే వీరూ ధాటికి గల్లీ బౌలర్‌లా కనిపించాడంటే.. హెరాత్‌, కులశేఖర, వెలిగెదరల పరిస్థితి చెపాల్సిన పని లేదు.

అనుకూలమైన రోజు ఏం చేసినా చెల్లుతుందన్నట్లు.. ఆ రోజు వీరూ ఏ షాట్‌ ఆడినా ఎదురు లేకపోయింది. బంతి ఎక్కడ పడి ఎలా తిరుగుతుందో తెలియని మురళీ బౌలింగ్‌లో వీరూ రెండుసార్లు రివర్స్‌ స్వీప్‌ ఆడి బౌండరీలు సాధించాడు. హెరాత్‌ బౌలింగ్‌లోనూ ఆ షాట్లు ఆడాడు. ఇక వీళ్లిద్దరి బౌలింగ్‌లో ముందుకు దూసుకొచ్చి కొట్టిన సిక్సర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే.ఆట ఆఖర్లో కొట్టిన అప్పర్‌ కట్‌ కూడా ఒక క్లాసిక్‌ షాట్‌.

తొలి 15 పరుగులకు 31 బంతులు తీసుకున్న వీరూ.. ఆ తర్వాత ఒక్కసారిగా గేర్లు మార్చాడు. అక్కడి నుంచి కొట్టు కొట్టు కొట్టు అన్నట్లుగా సాగింది అతడి బ్యాటింగ్‌. 54 బంతుల్లో 50.. 101 బంతుల్లో 100.. 130 బంతుల్లో 150.. 168 బంతుల్లోనే 200.. 207 బంతుల్లో 250.. ఇలా సాగింది వీరూ ప్రతాపం. లంచ్‌కు అర్ధశతకం సాధించిన అతను.. టీకల్లా 150 దాటేశాడు. వెన్ను నొప్పి బాధిస్తున్నా సరే.. అతను ఎక్కడా ఆగలేదు. ఆట ఆఖరుకు 239 బంతుల్లోనే 284 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

అప్పటికే రెండు ట్రిపుల్‌ సెంచరీలు సాధించిన వీరూ.. మూడోసారి ఈ ఘనత అందుకోవడం లాంఛనమే అనుకున్నారంతా. కానీ మూడో రోజు ఇంకో 9 పరుగులే జోడించి, మురళీకి తేలికైన రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటైపోయాడు. విజయ్‌ (87), ద్రవిడ్‌ (74), ధోని (100 నాటౌట్‌) రాణించడం వల్ల 726/9 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో జహీర్‌ (5/72) చెలరేగగా.. లంక 309 పరుగులకే ఆలౌటైంది. భారత్‌ ఇన్నింగ్స్‌ విజయం సాధించి సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకుంది. వీరూ కెరీర్లో ఎన్నో మెరుపు ఇన్నింగ్స్‌లున్నాయి కానీ.. వాటిలోకెల్లా ఇది ప్రత్యేకం.

బ్యాట్స్​మెన్​: వీరేంద్ర సెహ్వాగ్​

పరుగులు: 293

బంతులు: 254

బౌండరీలు: 40 ఫోర్లు, 7 సిక్సర్లు

ప్రత్యర్థి: శ్రీలంక

ఫలితం: ఇన్నింగ్స్​ 24 పరుగులతో భారత్​ గెలుపు

సంవత్సరం: 2009

ఆ 11 ఓవర్లు తగ్గకపోయుంటే..

టెస్టు మ్యాచ్‌లో రోజుక 90 ఓవర్లు పడతాయి. అయితే వీరూ విధ్వంసక రీతిలో ఆడి 284 పరుగులతో అజేయంగా నిలిచిన రోజు భారత్‌ ఆడింది 79 ఓవర్లే. ఉదయం 366/8తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన లంక.. 5.4 ఓవర్లు ఆడి మిగతా రెండు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్‌ విరామంతో కలిపి మొత్తం 40 నిమిషాల తర్వాత భారత్‌ బ్యాటింగ్‌ ఆరంభించింది. ఒకవేళ రెండో రోజు పూర్తిగా టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ చేసి ఉంటే.. ఒక్క రోజు వ్యవధిలో ట్రిపుల్‌ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేవాడేమో వీరూ.

ఇదీ చూడండి.. వచ్చే ఏడాదికి మహిళల ప్రపంచకప్​ వాయిదా

ABOUT THE AUTHOR

...view details