తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెస్టుల్లో కేశవ్ రికార్డు.. ఒకే ఓవర్​లో 28 పరుగులు

ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో టెస్టులో సఫారీ క్రికెటర్ కేశవ్ మహారాజ్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రూట్ వేసిన ఓ ఓవర్​లో 28 పరుగులు బాదాడీ ఆటగాడు.

Maharaj
కేశవ్

By

Published : Jan 20, 2020, 7:53 PM IST

Updated : Feb 17, 2020, 6:37 PM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో దక్షిణాఫ్రికా స్పిన్‌ బౌలర్‌ కేశవ్‌ మహారాజ్‌ తన బ్యాటింగ్‌తో రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో జో రూట్ వేసిన ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించి టెస్టు క్రికెట్‌లో కొత్త రికార్డు నెలకొల్పాడు.

ఏం జరిగిందంటే..!

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌.. 82వ ఓవర్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న మహారాజ్‌.. జోరూట్‌కు చుక్కలు చూపించాడు. తొలి మూడు బంతులను బౌండరీలు బాదిన అతడు, తర్వాతి రెండు బంతులను సిక్సులుగా మలిచాడు. చివరి బంతి లెగ్‌బైస్‌గా వెళ్లిన కారణంగా మరో నాలుగు పరుగులు లభించాయి. ఈ ఓవర్‌లో మొత్తం 28 పరుగులు వచ్చాయి. టెస్టు క్రికెట్‌లో ఇలా జరగడం ఇది మూడోసారి. సుదీర్ఘ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు తీసిన ఆటగాళ్ల జాబితాలో మహారాజ్‌ మూడో ఆటగాడిగా నిలిచాడు.

విండీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ బ్రియన్‌ లారా 2003-04 సీజన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో తొలిసారి 28 పరుగులు సాధించాడు. రాబిన్‌ పీటర్సన్‌ వేసిన ఆ ఓవర్‌లో లారా (4 6 6 4 4 4 ) చితక్కొట్టాడు. అలాగే 2013-14 సీజన్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ జార్జ్‌ బెయిలీ ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్నే పరుగులు చేశాడు. జేమ్స్‌ ఆండర్సన్ బౌలింగ్‌లో.. బెయిలీ (6 2 4 6 6 4) బ్యాట్‌ ఝుళిపించాడు. తాజాగా మహారాజ్‌.. రూట్‌ బౌలింగ్‌లో(4 4 4 6 6 బైస్‌4) విరుచుకుపడ్డాడు. పాకిస్థాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది 2005-06 సీజన్‌లో భారత స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌పై ఎదురుదాడి చేశాడు. భజ్జీ బౌలింగ్‌లో (6 6 6 6 2 1) చెలరేగడం వల్ల ఈ ఓవర్‌లో 27 పరుగులు వచ్చాయి.

ఈరోజు పూర్తయిన మూడో టెస్టులో కేశవ్‌(71; 106 బంతుల్లో 10x4, 3x6) ధాటిగా ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. చివర్లో అతడికి సహకరించే బ్యాట్స్‌మన్‌ లేని కారణంగా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 499 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 209 పరుగులకు ఆలౌటైంది. చివరికి ఫాలోఆన్‌లో కూడా 237 పరుగులకే కుప్పకూలింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ 2-1తో ఆధిక్యంలో నిలిచింది.

ఇవీ చూడండి.. స్టార్క్​ బ్యాటింగ్​పై భార్య హేలీ ఫన్నీ ట్వీట్

Last Updated : Feb 17, 2020, 6:37 PM IST

ABOUT THE AUTHOR

...view details