దక్షిణాఫ్రికా టెస్టు సారథి డుప్లెసిస్... చీకట్లో తమ వికెట్లు తీసిటీమిండియా గెలిచిందనే వ్యాఖ్యలు చేశాడు. ఈ మాటలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా అతడిపై ట్రోల్స్, మీమ్స్‌తో విమర్శలు చేస్తున్నారు.
ఏమైంది..?
ఇటీవలే జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా చేతిలో 3-0 తేడాతో వైట్‌వాష్ అయింది దక్షిణాఫ్రికా. ఒక్క మ్యాచ్‌లోనూ సరైన ప్రదర్శన కనబర్చలేకపోయింది. ఈ ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడిన సఫారీ కెప్టెన్ డుప్లెసిస్.. ఓడిపోవడానికి కొత్త కారణం చెప్పాడు. టాస్ ప్రతిసారి కోహ్లీసేనకు అనుకూలంగా రావడం, చీకటిగా ఉన్నప్పుడు భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం వంటి కారణాలవల్లే మ్యాచ్‌లు కోల్పోయామని అన్నాడు.
" ప్రతి టెస్టులో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. 500 పరుగులు చేసి చీకటి సమయంలో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ ఇచ్చేవారు. ఆ తర్వాత మా జట్టువి మూడు వికెట్లు పడగొట్టేవారు. మూడో రోజు ఆటను ఒత్తిడితో కొనసాగించేవాళ్లం. ప్రతి టెస్టులోనూ ఇదే పునరావృతమైంది"
-- డుప్లెసిస్, దక్షిణాఫ్రికా సారథి