టీమిండియాతో వరుసగా రెండు టెస్టుల్లో పరాజయం పాలైన దక్షిణాఫ్రికా... రాంచీ వేదికగాశనివారం చివరి టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు సఫారీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ మార్కరమ్ తనను తానే గాయపర్చుకుని యాజమాన్యానికి షాకిచ్చాడు. చివరి టెస్టుకు దూరమయ్యాడు.
రెండు టెస్టుల్లోనూ నిరాశే ...
తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో 5, 39 పరుగులే చేసిన మార్కరమ్... రెండో టెస్టులో రెండుసార్లు డకౌట్ అయ్యాడు. అనంతరం తీవ్ర నిరాశ చెందిన ఈ క్రికెటర్... ఆవేశంలో చేతికి గాయం చేసుకున్నాడు. కుడిచేయి మణికట్టుకు దెబ్బ గట్టిగా తగలడం వల్ల తర్వాతి మ్యాచ్‌కు దూరమయ్యాడు. వెంటనే స్వదేశానికి పయనమయినట్లు సమాచారం.
" సిరీస్ మధ్యలో ఇలా స్వదేశానికి పయనమవ్వాల్సి వస్తుందని ఊహించలేదు. ఇది చాలా బాధాకరం. నాకు గాయం కావడం కంటే క్లిష్ట పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా జట్టుకు దూరం కావడం బాధిస్తోంది. నేనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. డకౌట్‌గా పెవిలియన్ చేరడం వల్లే నిరాశలో నా చేతికి గాయం చేసుకున్నా. కొన్ని సందర్బాల్లో నిరాశ కూడా మరింత మెరుగు కావడానికి దోహదం చేస్తుంది". -- మార్కరమ్, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్
దక్షిణాఫ్రికాతో విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి టెస్టులో... కోహ్లీసేన.. 203 పరుగుల తేడాతో విజయం సాధించింది. పుణెలో జరిగిన రెండో టెస్టులో, ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో గెలుపొందింది భారత్. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది.
ప్రస్తుతం ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది భారత్. చివరి మ్యాచ్‌లో గెలిస్తే 240 పాయింట్లతో మరింత ముందుకు దూసుకెళ్తుంది.