కోహ్లీ-రోహిత్ శర్మ ద్వయం కంటే భారత దిగ్గజాలు సచిన్ తెందూల్కర్- సౌరభ్ గంగూలీ జోడీ ఉత్తమమైందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అంటున్నాడు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లీ, రోహిత్ జంటకు తిరుగులేకపోవచ్చు.. కానీ వీళ్లతో పోల్చుకుంటే సచిన్, సౌరభ్ జోడీ అత్యుత్తమ, నాణ్యమైన బౌలర్లను ఎదుర్కొని పరుగులు సాధించింది అని చాపెల్ అన్నాడు.
"కోహ్లీ, రోహిత్.. భారత అత్యుత్తమ వన్డే ఆటగాళ్లు అని వాదించవచ్చు. కానీ 15 ఏళ్ల పాటు నాణ్యమైన అంతర్జాతీయ బౌలర్లను ఎదుర్కొన్న సచిన్, సౌరభ్‌లు వాళ్లిద్దరి కంటే ముందుంటారు. ఓపెనింగ్‌లో ఈ మాజీ జోడీ.. బ్యాట్స్‌మెన్ నైపుణ్యాలకు పరీక్ష పెట్టిన వసీం అక్రమ్, వకార్ యూనిస్ (పాకిస్థాన్), ఆంబ్రోస్, కోట్నీ వాల్ష్ (వెస్టిండీస్), మెక్‌గ్రాత్, బ్రెట్‌లీ (ఆస్ట్రేలియా), అలన్ డొనాల్డ్, షాన్ పొలాక్ (దక్షిణాఫ్రికా), మలింగ, చమిందా వాస్ (శ్రీలంక) లాంటి బౌలర్లకు దీటుగా బదులిచ్చింది. ఎదుర్కొన్న ప్రత్యర్థులను బట్టి చూస్తే సచిన్, సౌరభ్ వైపే మొగ్గుచూపుతా. ఆడిన ఇన్నింగ్స్ ప్రకారం చూస్తే మాత్రం కోహ్లీ, రోహిత్ ముందుంటారు. వన్డే, టీ20ల్లో వీళ్ల ఉమ్మడి రికార్డులు అద్భుతం. కోహ్లీ రెండు ఫార్మాట్లలోనూ 50కి పైగా సగటుతో కొనసాగుతుండడం అద్వితీయం. సచిన్ ఎక్కువగా టీ20 మ్యాచ్‌లు ఆడలేదు. పొట్టి ఫార్మాట్ ఆరంభమవుతున్న సమయంలోనే సౌరభ్ కెరీర్ ముగిసింది. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యుత్తమమైన ఈ నలుగురి ఆటకు సాక్షిగా నిలిచిన భారత అభిమానులు అదృష్టవంతులు."
-ఇయాన్ చాపెల్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్