తెలంగాణ

telangana

ETV Bharat / sports

'లార్డ్స్​లో​ తొలి శతకం.. నా జీవితంలో గొప్ప క్షణాలు' - సౌరభ్ గంగూలీ తాజా వార్తలు

1996లో ఇంగ్లాండ్​తో సిరీస్​ సందర్భంగా ప్రఖ్యాత లార్డ్స్​లో తొలి శతకం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు గంగూలీ. తన జీవితంలో ఆ క్షణాలు మర్చిపోలేనవి అని చెబుతూ, ఆ ఫొటోల్ని ట్వీట్ చేశాడు.

'లార్డ్స్​లో​ తొలి శతకం.. నా జీవితంలో గొప్ప క్షణాలు'
సౌరభ్ గంగూలీ

By

Published : Jun 20, 2020, 12:06 PM IST

ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో టెస్టు అరంగేట్రంలోనే ఇంగ్లాండ్‌పై శతకంతో కదంతొక్కి తానేంటో నిరూపించుకున్నాడు టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ. 1996 ఇంగ్లాండ్‌ పర్యటన సందర్భంగా దాదా, నాలుగేళ్ల తర్వాత జట్టులోకి పునరాగమనం చేసిన సందర్భం అది. 1992లోనే వెస్టిండీస్‌పై వన్డే అరంగేట్రం చేసిన అతడు.. ఆ మ్యాచ్‌లో విఫలమై జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికై ఆ నాలుగేళ్లూ టీమ్‌ఇండియా ఏం కోల్పోయిందో అందరికీ తెలిసేలా చేశాడు. అయితే, దాదాకు తొలి టెస్టులో అవకాశం రాలేదు. అప్పటికే మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ చాలా మంది ఉండడం వల్ల జట్టు యాజమాన్యం అతడిని ఆడించలేదు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ తొలి టెస్టులో గెలుపొందింది. అనంతరం లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 344 పరుగుల భారీ స్కోరు చేసింది.

రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా బరిలోకి దిగగా, ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అప్పుడే గంగూలీ మూడో స్థానంలో క్రీజులోకి వెళ్లి పటిష్టమైన ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ను చిత్తు చేశాడు. తనదైన బ్యాటింగ్‌తో చూడముచ్చటైన షాట్లతో అలరించాడు. అలా 131 పరుగులు చేసి లార్డ్స్‌లో అరంగేట్ర టెస్టులోనే శతకం సాధించాడు. దాంతో ఆ నాలుగేళ్లు టీమ్‌ఇండియా ఏం కోల్పోయిందో ప్రపంచానికి చాటిచెప్పాడు. టెస్టుల్లో తొలి మ్యాచ్‌లోనే శతకం బాదిన పదో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఆ మైదానంలో సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందాడు. కాగా, దాదా బ్యాటింగ్‌తో టీమ్‌ఇండియా ఆ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. చివరికి ఆ టెస్టు సిరీస్‌ను మాత్రం 0-1తో కోల్పోయింది.

ఆ అద్భుత శతకాన్ని గుర్తు చేసుకున్న గంగూలీ.. శనివారం ఆ మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. తన జీవితంలో ఇదో ప్రత్యేకమైన రోజని పేర్కొన్నాడు.

'ఈరోజే టెస్టుల్లో అరంగేట్రం చేశా. జీవితంలో గొప్ప క్షణాలు. లార్డ్స్‌లో తొలి శతకం సాధించడం నా కెరీర్‌లోనే గొప్ప విశేషం' అని రాసుకొచ్చాడు. ఇదే మ్యాచ్‌ గురించి గతంలో ఓసారి ఇండియాటుడే కార్యక్రమంలో మాట్లాడుతూ.. '1996లో లార్డ్స్‌లో ఆడుతున్నప్పుడు నా ఆలోచనా విధానం నమ్మశక్యం కాని విధంగా ఉంది. అప్పుడు నాకు ఎలాంటి భయమూ లేదు. అలా వెళ్లి ఆడేశాను. అంతకుముందు బ్రిస్టల్‌లో ఆడిన వార్మప్‌ మ్యాచ్‌ గుర్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగా. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 70 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలిపోయా. ఆ తర్వాత సిరీస్‌ ప్రారంభమయ్యాక మరింత బాగా రాణించా' అని దాదా తన మధురానుభూతులను నెమరువేసుకున్నాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details