తండ్రి మరణాన్ని దిగమింగి, భారత జట్టు కోసం ఆస్ట్రేలియాలో ఉండిపోయిన పేసర్ మహమ్మద్ సిరాజ్ వ్యక్తిత్వం గొప్పదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. సిరాజ్ తండ్రి మహమ్మద్ గౌస్ (53) అనారోగ్య సమస్యలతో శుక్రవారం మరణించాడు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న సిరాజ్.. జట్టు కోసం తన తండ్రి అంత్యక్రియలకూ రాలేకపోయాడు.
"తండ్రి మరణంతో ఏర్పడిన నష్టాన్ని అధిగమించేందుకు అవసరమైన స్థైర్యం సిరాజ్‌కు ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలో అతను విజయవంతం కావాలని కోరుకుంటున్నా. అతని వ్యక్తిత్వం గొప్పది."
- సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
ఆస్ట్రేలియాతో పర్యటనకు టెస్టు జట్టుకు తొలిసారి ఎంపికైన సిరాజ్‌కు.. తన తండ్రి అంత్యక్రియల కోసం భారత్‌కు తిరిగి వచ్చేందుకు అవకాశం ఇచ్చామని, కానీ అతను అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు.
"సిరాజ్‌తో బీసీసీఐ చర్చించింది. ఈ విషాద సమయంలో తన కుటుంబంతో ఉండేందుకు తిరిగి భారత్ వెళ్లే అవకాశం అతనికి కల్పించింది. కానీ అతను టీమ్‌ఇండియాతోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అతని బాధను పంచుకున్న బీసీసీఐ.. ఈ క్లిష్ట సమయాల్లో తనకు అండగా ఉంటుంది" అని బీసీసీఐ ప్రకటనలో జై షా పేర్కొన్నాడు.