టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం లాంఛనమే. ఈ సందర్భంగా అపెక్స్ కౌన్సిల్లో కొంత మంది సభ్యులతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడీ మాజీ ఆటగాడు. "కొత్త జట్టు ఇదే.. అందరం కలిసి బాగా పనిచేస్తాం" అని సందేశమూ పెట్టాడు.
బృందమిదే...
బీసీసీఐ తొమ్మిది మంది సభ్యుల అత్యున్నత మండలిలో పదవుల కోసం గంగూలీతో పాటు మరి కొందరు నామినేషన్ వేశారు. వారిలో కార్యదర్శి పదవికి జై షా (కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు) నామినేషన్ సమర్పించాడు. ఇంకా మహిమ్ వర్మ (ఉపాధ్యక్షుడు), అరుణ్ సింగ్ ధూమల్ (కోశాధికారి), బ్రిజేష్ పటేల్ (ఐపీఎల్ పాలకమండలి సభ్యుడు), జయేష్ జార్జ్ (సంయుక్త కార్యదర్శి), ఖైరుల్ మజుందార్ (పాలక మండలి సభ్యుడు), ప్రభ్‌జ్యోత్ సింగ్ (కౌన్సిలర్) కూడా నామినేషన్లు వేశారు. వీళ్లందరి ఎన్నిక ఏకగ్రీవమని తెలుస్తోంది. బ్రిజేష్ పటేల్ ఐపీఎల్ ఛైర్మన్ కాబోతుండటం లాంఛనమైంది.
ఈనెల 23న ఫలితాలు...
నాటకీయ పరిణామాల మధ్య దేశంలోని అన్ని క్రికెట్ సంఘాలకూ ఆమోద యోగ్యమైన అభ్యర్థిగా మారిన గంగూలీ.. సోమవారం బోర్డు అధ్యక్ష పదవికి నామినేషన్ వేశాడు. అనుకున్నట్లే అతడికి పోటీ లేకపోయింది. ఇంకెవ్వరూ నామినేషన్ వేయలేదు. అధ్యక్షుడిగా దాదా ఎన్నిక ఖరారైంది. అయితే ఈ నెల 23న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా.. ఓటింగ్ ఏమీ లేకుండానే వీళ్లందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించనున్నారు.