ఫ్లడ్‌లైట్ల వెలుగులో బంతి మెరుస్తుందని, దీని వల్ల ఆటగాళ్లకు ఇబ్బందులు ఎదురవుతాయని మ్యాచ్‌కు ముందు కొందరు క్రికెట్ పండితులు అభిప్రాయపడ్డారు. దీనిపైటీమిండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ... గులాబి టెస్టుపై తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. సంప్రదాయ ఎరుపు బంతి కన్నా ఇదే బాగా కనిపిస్తుందని... మైదానంలో ఈ బాల్‌ను గుర్తించడమే సులభమని అన్నాడు.
ఈడెన్ వేదికగా బంగ్లాతో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో... కోహ్లీ 27వ టెస్టు సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. 136 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటైన విరాట్... చారిత్రక డేనైట్ టెస్టులో తొలి శతకం చేసిన భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అయితే ఫ్లడ్‌లైట్ల వెలుతురులోనే మంచు ప్రభావం ఉన్నా అద్భుతంగా ఆడాడీ స్టార్ బ్యాట్స్‌మన్. విరాట్ ప్రదర్శనపైనా ప్రశంసల వర్షం కురిపించాడు దాదా... అతడిని పరుగుల యంత్రంగా అభివర్ణించాడు.
హసీనాకు థ్యాంక్స్...
శుక్రవారం డేనైట్ టెస్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు గంగూలీ. వచ్చే ఏడాది ఆ దేశ జాతిపిత.. బంగబందు షేక్ ముజీబుర్ రెహ్మన్ శతజయంతికి హాజరవుతానని చెప్పాడు దాదా. ఆ సమయంలో ఆసియన్ ఆల్‌స్టార్స్ ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్‌లకు ముఖ్య అతిథిగా గంగూలీ వెళ్లనున్నాడు.
తొలి రోజు మ్యాచ్‌కు 60వేల మంది హాజరైనట్లు తెలిపాడు గంగూలీ. " చాలా మంది మ్యాచ్‌ను వీక్షించారు అది హర్షనీయం. నాకు ఎలాంటి ఒత్తిడి అనిపించలేదు. కానీ కొంచెం తీరిక లేకుండా ఉన్నాను" అని దాదా అన్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా జట్టు 106 పరుగులకు ఆలౌటవడంపై స్పందించిన గంగూలీ... ప్రధాన ఆటగాళ్లు షకీబుల్ హసన్, తమీమ్ ఇక్బాల్ లేకపోవడం వల్ల.. జట్టు కొంచెం బలహీనమైందని అన్నాడు. ఆస్ట్రేలియాలో వచ్చే ఏడాది టీమిండియా పింక్ టెస్టు ఆడుతుందా లేదా అన్న ప్రశ్నకు మాత్రం జవాబివ్వలేదు సౌరభ్ గంగూలీ.