బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ దూకుడైన బ్యాటింగ్‌కు కోట్లాది అభిమానులున్నారు. కానీ దాదా బయట ఎక్కువగా ఎంటర్టైన్ చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఓ టీవీ షోలో డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్‌తో కలిసి స్టెప్పులేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
గంగూలీ, హర్భజన్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, జహీర్‌ఖాన్, భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ షోలో పాల్గొన్నారు. పాపులర్ సింగర్ ఉష ఉతుప్.. బాలీవుడ్ హిట్ సినిమా 'జిందగీ నా మిలేగి దుబారా'లోని 'సెనోరిటా' పాట పాడగా.. దాదాతో కలిసి భజ్జీ చిందేశాడు. వారిద్దరి స్టెప్పులను చూసి లక్ష్మణ్, సెహ్వాగ్, కైఫ్ కరతాల ధ్వనులు చేస్తూ నవ్వులు చిందించారు.
గంగూలీ సారథ్యంలోనే హర్భజన్ వెలుగులోకి వచ్చాడు. 2001లో ఈడెన్‌గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో భజ్జీ హ్యాట్రిక్‌తో సహా 13 వికెట్లు తీసి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో వరుసగా 16 టెస్టుల్లో గెలిచి జైత్రయాత్ర కొనసాగిస్తున్న ఆసీస్‌కు గంగూలీ సేన చెక్ పెట్టింది. ఇటీవల అప్పటి జ్ఞాపకాలను దాదా పంచుకుంటూ.. "తొలి చూపులోనే ప్రేమ పుడుతుందని అందరూ చెబుతుంటారు. ఈడెన్‌లో 13 వికెట్లు పడగొట్టిన హర్భజన్‌ను చూసి లవ్ ఎట్ ఫస్ట్‌సైట్‌గా అనిపించింది. అతడి బౌలింగ్ చూసి ఫిదా అయ్యాను. భారత క్రికెట్‌లో అతడు మార్పులు తీసుకొస్తాడని నమ్మాను. తర్వాత అతడు 700 వికెట్లు పడగొట్టడం నాకు పెద్దగా ఆశ్చర్యమేమి అనిపించలేదు" అని భజ్జీని కొనియాడాడు దాదా.
ఇవీ చూడండి.. 2024 పొట్టి ప్రపంచకప్‌లో 20 జట్లు!