తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సచిన్​లా ధోనీని భుజాలపై ఎత్తుకుని తిరగాలి' - శ్రీశాంత్ తాజా వార్తలు

టీ20 ప్రపంచకప్​లో ధోనీ ఆడాలని అంటున్నాడు క్రికెటర్ శ్రీశాంత్. 2011 ప్రపంచకప్ విజయం తర్వాత సచిన్​ను భుజాలపై ఎత్తుకొని తిరిగినట్లుగా ధోనీని ఎత్తుకొని తిరగాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Someone should take Dhoni on their shoulders and walk along the Ground says Sreesanth
శ్రీశాంత్

By

Published : Jun 26, 2020, 7:40 PM IST

వాంఖడే మైదానంలో 2011 వన్డే ప్రపంచకప్‌లో గెలిచాక క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ను టీమ్‌ఇండియా ఆటగాళ్లు భుజాలపై ఎత్తుకొని తిరిగారు. ఈ సన్నివేశాన్ని క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. అలాగే ధోనీని కూడా టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఎత్తుకొని తిరగాలని క్రికెటర్‌ శ్రీశాంత్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

"మహీ భాయ్‌ కచ్చితంగా టీ20 ప్రపంచకప్‌ ఆడాలి. ఆ మెగా ఈవెంట్‌ కన్నా ముందే ఐపీఎల్‌ జరుగుతుందని కచ్చితంగా భావిస్తున్నా. దాంతో అతడి బ్యాటింగ్‌ చూసే అదృష్టం మనకు కలుగుతుంది. ఎందుకంటే అతడి రిటైర్మెంట్‌పై అనేక మంది మాట్లాడుకుంటున్నారు. అయినా, అతను మౌనంగానే ఉన్నాడు. ఏం చేయాలో ధోనీకి బాగా తెలుసు. ప్రపంచం ఏమనుకున్నా పర్లేదు. అతను మన దేశానికి సేవ చేస్తున్నాడు. ఆర్మీలోనూ సేవలందిస్తున్నాడు. ఇక రాజకీయాల్లోకి మాత్రం ప్రవేశించనని ముందే స్పష్టంచేశాడు. అతని రిటైర్మెంట్‌పై అతడినే నిర్ణయం తీసుకోనియండి."

-శ్రీశాంత్, టీమ్​ఇండియా క్రికెటర్

ఒక క్రికెట్‌ అభిమానిగా 2011 ప్రపంచకప్‌ ఫైనల్లో శ్రీలంకపై గెలిచాక సచిన్‌ను భుజాలపై ఎత్తుకొని తిరగడం తాను చూశానని, అలాగే ధోనీ కూడా టీ20 ప్రపంచకప్‌లో ఆడి గెలిచాక మైదానంలో ఆటగాళ్ల భుజాలపై తీసుకెళ్లడం తనకు చూడాలని ఉందన్నాడు.

2013 ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌ కేసులో ఇరుక్కున్న శ్రీశాంత్‌ మళ్లీ టీమ్‌ఇండియాకు ప్రాతనిధ్యం వహించాలని భావిస్తున్నాడు. స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో బీసీసీఐ అతడిపై జీవితకాలం నిషేధం విధించింది. ఈ కేసులో దిల్లీ ప్రత్యేక కోర్టు అతడిని గతంలోనే నిర్దోషిగా ప్రకటించినా బీసీసీఐ మాత్రం వెనక్కి తగ్గలేదు. గతేడాది సుప్రీంకోర్టు ఆ కేసును పరిశీలించి నిషేధ కాలాన్ని తగ్గించాలని ఆదేశించడం వల్ల బీసీసీఐ ఏడేళ్లకు పరిమితం చేసింది. ఈ సెప్టెంబర్‌తో ఆ గడువు పూర్తవుతుంది. ఆ తర్వాత శ్రీశాంత్‌ ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటే కేరళ రంజీ జట్టులో చేర్చుకోవడానికి ఆ రాష్ట్ర క్రికెట్‌ సంఘం సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే శ్రీశాంత్‌ ఇప్పుడు తన ఫిట్‌నెస్‌ను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యాడు. మళ్లీ టీమ్‌ఇండియాకు ఆడాలని పరితపిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details