తెలంగాణ

telangana

ETV Bharat / sports

చెపాక్​ పిచ్​పై మాజీల వ్యాఖ్యలు.. గావస్కర్​ చురకలు! - చెపాక్​ టెస్టు వార్తలు

భారత్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో టెస్టు​పై మాజీ క్రికెటర్ల మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. ఈ మ్యాచ్​ కోసం భారత్​ ప్రత్యేకంగా స్పిన్​ పిచ్​ను సిద్ధం చేసుకుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ సునీల్​ గావస్కర్​ గట్టిగా బదులిచ్చారు.

'Some people are always complaining,' Sunil Gavaskar says Chennai pitch 'not unplayable'
గావస్కర్

By

Published : Feb 16, 2021, 6:46 AM IST

Updated : Feb 16, 2021, 9:16 AM IST

చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో భారత్‌-ఇంగ్లాండ్‌ తొలి టెస్టుతో పోలిస్తే రెండో టెస్టులో తొలి రోజు నుంచే బంతి బాగా తిరుగుతున్న నేపథ్యంలో మార్క్‌ వా, మైకేల్‌ వాన్‌ స్పందించారు.

"చెన్నై పిచ్‌ టెస్టు మ్యాచ్‌కు పనికి రాదు. పాద ముద్రలేమీ లేకున్నా తొలి రోజు నుంచే బంతి అలా తిరగడం ఆమోదయోగ్యం కాదు"

-మార్క్‌ వా, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌

"చెన్నై పిచ్‌ నన్ను విస్మయానికి గురి చేసింది. భారత్‌ పైచేయి సాధిస్తోంది కాబట్టి సాకులు వెతకలేం కానీ.. ఇది కచ్చితంగా అయిదు రోజులు మన్నే పిచ్‌ మాత్రం కాదు"

-మైకేల్‌ వాన్‌, ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌

వీళ్లిద్దరే కాదు.. ఇంగ్లాండ్‌ మద్దతుదారులు చాలామంది చెపాక్‌ పిచ్‌ విషయమై గగ్గోలు పెట్టేశారు. తొలి టెస్టులో తమను ఓడించిన ఇంగ్లాండ్‌ను దెబ్బ తీయడానికి భారత్‌ స్పిన్‌ పిచ్‌ తయారు చేసుకుందన్నది పరోక్షంగా వారి ఆరోపణ. ఇలాంటి పిచ్‌పై బ్యాటింగ్‌ చేయడం అసాధ్యం అన్నట్లుగా మాట్లాడేస్తున్నారు వీరంతా. కానీ ఇదే పిచ్‌ మీద రోహిత్‌ శర్మ తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ సెంచరీ సాధించాడు. రోహిత్‌ టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ కాబట్టి అతను భారీ శతకాన్ని సాధించడం విశేషం కాకపోవచ్చు. కానీ బౌలర్‌ అయిన అశ్విన్‌ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ కొట్టాడు. స్పిన్‌ పిచ్‌పై బ్యాటింగ్‌ టెక్నిక్‌ ఎలా ఉండాలో చెప్పడానికి అతడి ఇన్నింగ్స్‌ నిదర్శనం.

భారత తొలి ఇన్నింగ్స్‌లో రహానె, పంత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ సైతం అర్ధశతకాన్నందుకున్నారు. చెపాక్‌ పిచ్‌ గురించి ఫిర్యాదులు చేస్తున్న వాళ్లెవ్వరికీ ఈ ఇన్నింగ్స్‌లు కనిపించకపోవడం విడ్డూరం. ఇదే స్టేడియంలో ఏమాత్రం జీవం లేని పిచ్‌పై తొలి టెస్టులో ఆ జట్టు 578 పరుగులు చేసింది. అప్పుడేమో పిచ్‌లో జీవం లేదు, బ్యాటింగ్‌కు మరీ ఇంత అనుకూలంగా ఉంటే ఎలా అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఇప్పుడు పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా మారేసరికి భిన్నమైన స్వరాలు వినిపిస్తున్నాయి. బంతి తిరుగుతున్న పిచ్‌ మీద బ్యాటింగ్‌ చేయడం కూడా ఒక కళ అనే విషయం మరిచిపోతున్నారు. ఉపఖండ జట్లు పేస్‌ పిచ్‌లపై తడబడితే, తక్కువ స్కోర్లకే ఆలౌటైతే.. ఆ పిచ్‌లు సీమ్‌కు మరీ అంత అనుకూలంగా ఉన్నాయేంటన్న ప్రశ్నలే తలెత్తవు.

రెండు నెలల కిందట అడిలైడ్‌లో భారత్‌ 36 పరుగులకే కుప్పకూలితే పిచ్‌ గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. విదేశాల్లో మనవాళ్లు అక్కడి పిచ్‌లపై ఒకవేళ అభ్యంతరం వ్యక్తం చేసినా పేస్‌ పిచ్‌లపై ఆడలేని మన వాళ్ల బలహీనతల్ని ఎత్తి చూపుతారు. కానీ ఉపఖండంలో పిచ్‌లు స్పిన్‌కు కాస్త సహకరించగానే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ లాంటి జట్ల మద్దతుదారులు లబోదిబోమంటారు. స్పిన్‌ ఆడలేని ఆ దేశాల బ్యాట్స్‌మెన్‌ బలహీనత గురించి అసలు చర్చే ఉండదు.

ఈ ధోరణిపై భారత దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ స్పందిస్తూ.. "రోహిత్‌ ఇన్నింగ్స్‌ చూస్తే పిచ్‌ అంత ప్రమాదకరంగా ఏమీ లేదని స్పష్టమవుతోంది. పిచ్‌ అలా ఉంటే ఓ జట్టు 330 పరుగులు చేయగలదా? పిచ్‌ బ్యాటింగ్‌ చేయలేని విధంగా ఏమీ లేదు. కానీ బ్యాట్స్‌మెన్‌కు సవాలు విసురుతోంది. క్రికెట్‌ అంటే అలాగే ఉండాలి. తొలి టెస్టు తొలి రెండు రోజుల్లో బ్యాటింగ్‌ మరీ తేలిగ్గా ఉందన్నారు. ఇప్పుడు బంతికి, బ్యాటుకు సమతూకం ఉండేలా చూస్తే పిచ్‌ గురించి ఫిర్యాదులు చేస్తున్నారు" అన్నాడు.

అసలు ఇప్పుడు చర్చ జరగాల్సింది పిచ్‌ గురించి కాదని.. ఈ పిచ్‌పై బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు ఎలాంటి నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారన్న దానిపై అని సన్నీ స్పష్టం చేశాడు.

ఇదీ చూడండి:'పిచ్​ గురించి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు'

Last Updated : Feb 16, 2021, 9:16 AM IST

ABOUT THE AUTHOR

...view details