తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెట్​లోనూ జాతి వివక్ష.. ఇవిగో సాక్ష్యాలు..! - Incidents happened in cricket That were related to racism

అగ్రరాజ్యంలో ఆఫ్రికన్​ అమెరికన్​ జార్జ్​ ఫ్లాయిడ్​ ఓ కర్కశ పోలీసు అధికారి చేతిలో మృతి చెందడంపై అమెరికాలో జాతివివక్ష నిరసన పెద్ద ఎత్తున చెలరేగాయి. ఈ ఘటన తర్వాత ఆయా రంగాల్లోని ప్రముఖులు తాము కూడా వర్ణ, జాతి వివక్ష ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చారు. క్రికెట్​లోనూ ఇలాంటి అనుభవాలు చవిచూశామని విండీస్​ క్రికెటర్లు క్రిస్​గేల్​, డారెన్​ సామి ఆరోపించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో 'జెంటిల్​మెన్​ గేమ్​'లోనూ వర్ణ వివక్ష పేరుతో జరిగిన కొన్ని ఘటనలివే..

Racism instances in cricket
క్రికెట్​లోనూ జాతివివక్ష.. ఇవే కొన్ని సంఘటనలు

By

Published : Jun 9, 2020, 7:17 PM IST

క్రికెట్‌.. ఒక జెంటిల్‌మెన్‌ గేమ్ అని ప్రతి క్రికెటర్‌, అభిమాని గొప్పగా ఫీలవుతుంటారు. ఇందుకు తగ్గట్లే విభిన్న దేశాల క్రికెటర్లు.. రంగు, మతం, జాతి అనే తేడా లేకుండా ఈ క్రీడలో మమేకమై పోటీపడుతుంటారు. ఇక ఐపీఎల్​ లాంటి లీగ్​ల్లో అయితే ఒకే డ్రెస్సింగ్​రూమ్​ను​ పంచుకుంటారు. అయితే ఇలాంటి ఆటలోనూ జాత్యాంహంకార ధోరణి ఉందని ఇటీవలే ఆరోపించారు వెస్టిండీస్​ క్రికెటర్లు క్రిస్​ గేల్‌, డారెన్​ సామి. తమ కెరీర్‌లో ఎన్నోసార్లు జాతి వివక్షను ఎదుర్కొన్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో క్రికెట్​లోనూ చోటుచేసుకున్న జాతివివక్ష సంఘటనలను పరిశీలిస్తే..

దక్షిణాఫ్రికాకు చెందిన బాసిల్​ డీ ఒలీవిరా.. ఇంగ్లాండ్​ తరఫున ఆడేవాడు. అయితే ఇతడు 1968లో ఓసారి వర్ణ వివక్ష ఎదుర్కొన్నాడు. తన రంగు కారణంగా టెస్టు జట్టులో నుంచి అతడిని తొలగించారు. క్రికెట్​లో ఈ తరహా ఘటనలు ఇక్కడి నుంచే ప్రారంభం అయినట్లు తెలుస్తోంది.

టోనీ గ్రెగ్​ వర్సెస్​ విండీస్​

ఇంగ్లాండ్​ జట్టు కెప్టెన్​ టోనీ గ్రెగ్​ వెస్టిండీస్​ క్రికెటర్లపై సంచలన కామెంట్​ చేశాడు. 1976, మే నెలలో జరిగిన ఓ మ్యాచ్​ సందర్భంగా వారిని 'నేలకు నాకిస్తా' అంటూ వ్యాఖ్యానించాడు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. గతంలో వారు బానిసలు అన్న విషయాన్ని ప్రతిబింబించేట్లుగా ఉన్న ఈ మాటలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి.

టోనీ గ్రెగ్​ వర్సెస్​ వెస్టిండీస్​

ఆమ్లాను టెర్రరిస్టుగా..

ఆస్ట్రేలియా మాజీ సారథి డీన్​ జోన్స్​ ఓ టీవీ కార్యక్రమంలో ఆమ్లాను ఉగ్రవాదిగా పోల్చాడు. 2006 ఆగస్టులో కొలంబో వేదికగా శ్రీలంక, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్​ జరిగింది. అందులో లంక ఆటగాడు కుమార సంగక్కరను ఆమ్లా ఔట్​ చేశాడు. ఆ సమయంలో టీవీ విశ్లేషకుడిగా ఉన్న జోన్స్​.. 'ఉగ్రవాదికి మరో వికెట్​ దక్కింది' అన్నట్లుగా ఆమ్లాను సంభోదించాడు. అనంతరం ఆ విషయం చర్చనీయాంశంగా మారగా.. సదరు బ్రాడ్​క్యాస్టర్​ సంస్థ జోన్స్​ను పదవి నుంచి తొలగించింది.

ఆమ్లాను టెర్రరిస్టుగా..

మంకీగేట్​ వివాదం..

2008లో సిడ్నీ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌పై.. టీమ్​ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు వచ్చాయి. వాటిపై సైమండ్స్​ ఫిర్యాదు చేయగా.. రిఫరీ హర్భజన్‌పై 50 శాతం మ్యాచ్ ఫీజు కోతతో పాటు మూడు టెస్ట్‌ల నిషేధం విధించాడు. అయితే ఆ వ్యవహారంలో భజ్జీ తప్పులేదని అప్పటి భారత ఆటగాళ్లు స్పష్టం చేశారు. నిషేధం ఎత్తివేయకపోతే సిరీస్‌ నుంచి తప్పుకుంటామని హెచ్చరించారు. అప్పటి అప్పీల్‌ కమిషనర్ జాన్ హన్సెన్​ ముందు హర్భజన్‌కు మద్దతుగా మాట్లాడాడు సచిన్​. ఫలితంగా భజ్జీకి శిక్షను రద్దు చేశారు. అయితే అనంతరం సచిన్​ ఓ పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. భజ్జీ ఉత్తరాదిన వాడే ఓ తరహా పదం పలికాడని.. అది వ్యతిరేక అర్థం ఇచ్చేదేనని రాసుకొచ్చాడు​.

మంకీగేట్​ వివాదం..

ఒసామా మొయిన్​..

2015లో కార్డిఫ్​ వేదికగా జరిగిన ఓ టెస్టు సందర్భంగా వివక్ష ఎదుర్కొన్నాడు ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ మొయిన్​ అలీ. ఆస్ట్రేలియా ఆటగాడు ఒకరు తనను 'ఒసామా బిన్​లాడెన్'​తో పోల్చినట్లు చెప్పాడు. ఆ సమయంలో మైదానంలో ఉండటం వల్ల కోప్పడలేదని .. తన ఆటో బయోగ్రఫీలో రాసుకొచ్చాడు. అయితే ఆ వ్యక్తి ఎవరనేది వెల్లడించలేదు.

ఒసామా మొయిన్​..

ఐపీఎల్​లో వివక్ష..

జార్జ్​ ఫ్లాయిడ్​ మృతికి సంతాపం తెలిపిన విండీస్ ప్లేయర్​ డారెన్​ సామి.. తను ఐపీఎల్​లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్నప్పుడు జాతివివక్ష ఎదుర్కొన్నట్లు ఆరోపించాడు. తనని, సహ ఆటగాడు తిసారా పెరీరాను.. జట్టు సహచరులు కొందరు 'కాలూ' అని పిలిచారని చెప్పాడు. తొలుత బలవంతుణ్ని అలా పిలుస్తారని అనుకున్నానని, రంగును చూసి పిలిచారని తెలిసి కోపం వస్తోందని పేర్కొన్నాడు. అయితే సామి వ్యాఖ్యలను ఫ్రాంఛైజీ ఖండించింది. అలా జరిగుంటే అప్పుడే ఫిర్యాదు చేయాల్సిందని పేర్కొంది. ఆ జట్టులోని మాజీ సహచరులు పార్థివ్‌ పటేల్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, వేణుగోపాల్‌ రావ్‌ సైతం సామి వ్యాఖ్యలను తిరస్కరించారు.

డారెన్​ సామీ

గేల్​ విమర్శలు..

కెరీర్‌లో చాలాసార్లు జాతివివక్షను ఎదుర్కొన్నానని వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్​మెన్ క్రిస్‌గేల్‌ అన్నాడు. క్రికెట్‌ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదని వెల్లడించాడు. 'నలుపు వారి జీవితాలు విలువైనవి' (బ్లాక్ లివ్స్​ మ్యాటర్​) అన్న ప్రచారానికి అతడు మద్దతు ప్రకటించాడు. జాతి వివక్షను ఎప్పుడు, ఎక్కడ ఎదుర్కొన్నాడో గేల్‌ స్పష్టంగా వివరించలేదు. కానీ అంతర్జాతీయ టీ20 లీగుల్లో ఇలాంటి పరిస్థితులు చవిచూశానని చెప్పుకొచ్చాడు.

క్రిస్​గేల్​

పాకిస్థాన్​ సారథి..

డర్బన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ వన్డేలో ప్రత్యర్థి క్రికెటర్‌ అండిలె ఫెలుక్‌వాయోపై జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేశాడు పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు సారథి సర్ఫరాజ్‌ అహ్మద్‌. స్టంప్‌ మైక్‌లో అతడు చేసిన పరుష వ్యాఖ్యలు రికార్డయ్యాయి. ఈ వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఆ తర్వాత సర్ఫరాజ్​ క్షమాపణలు కూడా కోరాడు.

కీపింగ్​లో పాకిస్థాన్​ సారథి సర్ఫరాజ్​

ఆర్చర్​పై అభిమానులు...

కొద్ది రోజుల క్రితం న్యూజిలాండ్‌లో ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ జోఫ్రా ఆర్చర్‌పై గుర్తు తెలియని ప్రేక్షకుడు ఒకడు అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం సృష్టించింది. వెంటనే కివీస్‌ బోర్డు, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నాయి. ఆర్చర్‌కు క్షమాపణలు తెలియ జేశాయి.

ఆర్చర్​

అమెరికాలో వివక్షకు సంబంధించి అల్లర్లు చెలరేగుతున్న వేళ.. తాము జాతి వివక్షకు వ్యతిరేకమని ప్రకటించాయి ఐసీసీ సహా పలు దేశాల బోర్డులు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details