తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీకే దక్కని రికార్డు.. స్మృతి మంధాన సొంతం - కోహ్లీ వార్తలు

భారత మహిళా క్రికెటర్​ స్మృతి మంధాన.. తన పేరుతో సరికొత్త రికార్డును సాధించింది. ఛేదనల్లో వరుసగా పదోసారి 50+ స్కోరు నమోదు చేసి.. సరికొత్త ఘనతను సృష్టించింది. అయితే పురుష క్రికెటర్లలో ఇలాంటి రికార్డు ఎవరికి లేకపోవడం గమనార్హం.

Smriti Mandhana becomes 1st cricketer to get 10 consecutive 50-plus scores while chasing
కోహ్లీకే దక్కని రికార్డు.. స్మృతి మంధాన సొంతం

By

Published : Mar 9, 2021, 9:54 PM IST

టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన అరుదైన ఘనత అందుకొంది. అంతర్జాతీయ క్రికెట్లో మరెవ్వరికీ సాధ్యంకాని రికార్డు సృష్టించింది. ఛేదనల్లో వరుసగా పదోసారి 50+ స్కోరు సాధించింది. ఛేదన రారాజు విరాట్‌ కోహ్లీకి ఇలాంటి రికార్డు లేకపోవడం గమనార్హం. పూనమ్‌ రౌత్‌ (62*)కు తోడుగా మంధాన (80*) చెలరేగిన వేళ దక్షిణాఫ్రికాపై రెండో వన్డేలో మిథాలీ సేన 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

లఖ్‌నవూలోని వాజ్‌పేయి స్టేడియంలో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీలను టీమ్‌ఇండియా 41 ఓవర్లకు కేవలం 157 పరుగులకే కుప్పకూల్చింది. సీనియర్‌ పేసర్‌ జులన్ గోస్వామి (4/42), రాజేశ్వరీ గైక్వాడ్‌ (3/37), మాన్సి జోషి (2/23) తమ బౌలింగ్‌తో ప్రత్యర్థిని వణికించారు. సున్ లూస్‌ (36), లారా గుడ్‌ఆల్‌ (49) టాప్‌ స్కోరర్లు.

మోస్తారు లక్ష్య ఛేదనకు దిగిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 22 వద్ద జెమీమా రోడ్రిగ్స్‌ (9)ను ఇస్మాయిల్‌ బౌల్డ్‌ చేసింది. ఈ క్రమంలో విజృంభించిన ఆడిన స్మృతి, పూనమ్‌ భారీ షాట్లు బాదారు. అజేయ అర్ధశతకాలు సాధించారు. 28.4 ఓవర్లలోనే జట్టుకు విజయం అందించారు.

సాహో.. స్మృతి

వన్డే కెరీర్లో 53 వన్డేలాడిన స్మృతి 44.14 సగటుతో 2119 పరుగులు చేసింది. 4 శతకాలు, 18 అర్ధశతకాలు సాధించింది. ఇందులో 24 మ్యాచుల్లో టీమ్‌ఇండియా ఛేదనకు దిగింది. దూకుడుగా ఆడే మంధాన వీటిలో 63.26 సగటుతో 1202 పరుగులు చేసింది. 2 సెంచరీలు, 12 అర్ధశతకాలు సాధించింది. అందులో 10 అర్ధశతకాలు వరుసగా సాధించడం ప్రత్యేకం.

2018, మార్చి 15 నుంచి ప్రతి ఛేదనలోనూ ఆమె 50+ స్కోర్లు చేసింది. 67, 52, 86, 53*, 73*, 105*, 90*, 63, 74, 80*తో విజృంభించింది. ఇంగ్లాండ్‌పై 3, ఆసీస్‌, న్యూజిలాండ్‌పై 2, శ్రీలంక, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికాపై ఒక్కోసారి 50+ స్కోరు సాధించింది. పురుషుల క్రికెట్లోనూ ఇలాంటి రికార్డు ఎవరికీ లేకపోవడం గమనార్హం. పాక్‌ దిగ్గజం జావెద్‌ మియాందాద్ వరుసగా 9 అర్ధశతకాలు చేశాడు. ప్రత్యేకించి ఛేదనల్లో కాదు. ఛేదన రారాజు విరాట్‌ చేసిందీ వరుసగా 5 అర్ధశతకాలే.

ఇదీ చూడండి:దెబ్బకు దెబ్బ: రెండోవన్డేలో మిథాలీసేనదే గెలుపు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details