ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్(97) బ్యాటింగ్ గార్డ్ మార్క్‌ను చెరిపేసిన స్టీవ్ స్మిత్ మరోసారి విమర్శల పాలయ్యాడు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ కావడం వల్ల ఇంకా తన దుర్బుద్ధిని మార్చుకోలేదని నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే, స్మిత్ అలా చేయలేదని ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ వెనకేసుకొచ్చాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన పైన్ టెస్టుల్లో స్మిత్ తరచూ క్రీజు వద్దకెళ్లి తాను బ్యాటింగ్ చేస్తున్నట్లు ఊహించుకుంటాడని చెప్పాడు. ఈ క్రమంలోనే తనకు అనుకూలంగా గార్డ్ మార్క్‌ను మార్చుకుంటాడని పేర్కొన్నాడు.
"ఈ విషయంపై నేను స్మిత్‌తో మాట్లాడాను. అయితే, ఆ వీడియో మరో విధంగా వైరల్ కావడం వల్ల అతడు బాధపడుతున్నాడు. స్మిత్ టెస్టు క్రికెట్ ఆడటం మీరు చూస్తే ప్రతి మ్యాచ్‌లో రోజుకు ఐదారుసార్లు అలా చేస్తాడు. అయితే, ఈ మ్యాచ్‌లో పంత్ గార్డ్ మార్క్‌ను అతడు చెరిపేయలేదు. ఒకవేళ అలా చేసినా టీమ్‌ఇండియా దీనిపై ఫిర్యాదు చేసేది. కానీ, చేయలేదు. అయితే, స్మిత్ అలా క్రీజు వద్దకెళ్లి అతడే బ్యాటింగ్ చేస్తున్నట్లు గార్డ్ మార్క్‌ను మార్చుకోవడం నేను చాలాసార్లు చూశా."