టీమ్ఇండియా 2011లో వన్డే ప్రపంచకప్ సాధించి పదేళ్లు గడిచాయి. అయినా, ఆ జ్ఞాపకాలు అభిమానుల గుండెల్లో ఇంకా పదిలంగా ఉన్నాయి. అప్పుడు సెమీఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసిన సైమన్ టౌఫెల్.. తాజాగా నాటి విశేషాలను గుర్తు చేసుకున్నారు. ఫైనల్లో ధోనీ కొట్టిన సిక్సర్‌తో ఊపిరిపీల్చుకున్నామని చెప్పారు. ఇటీవల ఐసీసీతో మాట్లాడిన మాజీ అంపైర్.. ఆ రెండు మ్యాచ్‌లకు సంబంధించిన ఆసక్తికర విశేషాలు ఇలా పంచుకున్నారు.
"మొహాలీ వేదికగా భారత్-పాక్ తలపడిన సెమీఫైనల్స్ అద్భుతమైన మ్యాచ్. దాన్ని ఇంకో ఫైనల్ అని చెప్పొచ్చు. ఆరోజు ఎలా ఉందంటే ప్రపంచం మొత్తం మమ్మల్ని చూస్తున్నట్లుగా అనిపించింది. అలాగే ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జెట్ ప్లేన్స్ ఉన్నాయేమో.. అవన్నీ చంఢీగడ్ ఎయిర్‌పోర్ట్‌లో పార్క్ చేశారేమో అనిపించింది. అప్పటికే తుదిపోరు జరగాల్సిన ముంబయి సంబరాలతో మునిగిపోయింది. దాన్ని నేను రెండో ఫైనల్స్‌గా భావిస్తా."
-సైమన్ టౌఫెల్, మాజీ అంపైర్