దేశవాళీ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ నేడే ప్రారంభం కానుంది. కిందటేడాది కరోనాతో వాయిదా పడగా.. ఇప్పుడు బయోబబుల్ వాతావరణంలో నిర్వహించనున్నారు. ఇటీవలే సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 టోర్నీ విజయవంతం కావడంతో.. దీనిపై ఆసక్తి నెలకొంది.
సూరత్, ఇందోర్, బెంగళూర్, జైపుర్, కోల్‌కతా, తమిళనాడులోని ఆరు వేదికల్లో ఈ టోర్నీ జరగనుంది. జట్లను 5 ఎలైట్ గ్రూప్‌లు, ఒక ప్లేట్ గ్రూప్‌గా విభజించారు. క్వార్టర్ ఫైనల్ మార్చి 8, 9 తేదీల్లో జరగనుంది. సెమీఫైనల్ మార్చి 11న, ఫైనల్ మ్యాచ్ మార్చి 14న నిర్వహించనున్నారు.
ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం..
జాతీయ జట్టులో చోటు కోసం కుర్రాళ్లకు చక్కటి వేదిక ఈ టోర్నీ. భారత్- ఇంగ్లాండ్ వన్డే, టీ-20 సిరీస్ నేపథ్యంలో.. సెలక్టర్లను ఆకర్షించేందుకు అన్క్యాప్డ్ ప్లేయర్లు, టీమ్ఇండియాలో తిరిగి చోటు కోసం ఇప్పటికే ఆడిన ఆటగాళ్లు, తమను తాము నిరూపించుకోవడానికి సీనియర్లు సిద్ధంగా ఉన్నారు. శనివారం నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో సత్తా చాటడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
సయ్యద్ ముస్తాక్ అలీ ఛాంపియన్ తమిళనాడు.. అదే ఊపులో విజయ్ హజారేను ఒడిసిపట్టాలని పట్టుదలగా ఉంది. ఈ టోర్నీలో విజయవంతమైన జట్టు కూడా తమిళనాడే. 5 సార్లు టైటిల్ విజేతగా నిలిచింది.
డిఫెండింగ్ ఛాంపియన్ కర్ణాటక సహా ముంబయి, దిల్లీ, పంజాబ్ కూడా బలంగానే కనిపిస్తున్నాయి.
శ్రేయస్, ధవన్, భువీ..
ఇప్పటికే పరిమిత ఓవర్ల ఫార్మాట్లో టీమ్ఇండియాకు ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ ముంబయి జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. జాతీయ జట్టులో పోటీ పెరిగిన నేపథ్యంలో.. తనను తాను నిరూపించుకునేందుకు ఇది మరో అవకాశం. అదే జట్టులోని మరో ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌కు భారత జట్టులో చోటు దక్కే అవకాశాలు అధికంగా ఉన్నందున.. శ్రేయస్‌కు ఇది కీలకం కానుంది. పృథ్వీ షా కూడా ఈ టోర్నీలో ఉత్తమ ప్రదర్శన చేస్తే టీమ్ఇండియాలో మళ్లీ చోటు దక్కే అవకాశాలు లేకపోలేదు.
గాయం కారణంగా.. జాతీయ జట్టుకు కొంత కాలంగా ఆడని పేసర్ భువనేశ్వర్ కుమార్ ఉత్తర్‌ప్రదేశ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇందులో సత్తా చాటి ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ఎంపిక కావాలని ఆశిస్తున్నాడు. తన స్థానంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో.. శిఖర్ ధవన్(దిల్లీ) కూడా రెచ్చిపోవాలని భావిస్తున్నాడు.
తమిళనాడు జట్టుకు సారథ్యం వహిస్తున్న దినేశ్ కార్తీక్ ఈ టోర్నీలో తనను తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ముస్తాక్ అలీ టోర్నీలో టైటిల్ అందించినా.. వ్యక్తిగతంగా పెద్దగా రాణించలేదు. టీమ్ఇండియాలో వికెట్ కీపర్‌గా చోటు సంపాదించుకునేందుకు అతడు కష్టపడాల్సిందే.
బరోడా కెప్టెన్ క్రునాల్ పాండ్య సహా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో నాకౌట్ చేరిన హరియాణా, రాజస్థాన్, బెంగాల్ ఆటగాళ్లు కూడా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని ఊవిళ్లూరుతున్నారు. అందుకోసం.. ఈ ట్రోఫీలో రాణించేందుకు సిద్ధమవుతున్నారు.