దిల్లీ క్యాపిటల్స్ సారథి శ్రేయస్ అయ్యర్ ఈసారి మరింత ధీమాగా కనిపిస్తున్నాడు. 2018లో గౌతం గంభీర్ నుంచి జట్టు పగ్గాలు అందుకున్నాడు శ్రేయస్. ఇతడి సారథ్యంలోని యువ దిల్లీ గతేడాది అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉండటం ఎంతో గర్వంగా ఉందని అంటున్నాడీ యువ కెప్టెన్. ఈసారి అభిమానులను ఏమాత్రం నిరాశపరబోమని హామీ ఇస్తున్నాడు.
"మా జట్టులో ఇద్దరు మేధావులున్నారు. సౌరభ్ గుంగూలీ, రికీ పాంటింగ్.. కెప్టెన్‌గా నాపై ఉన్న ఒత్తిడిని వీరు తగ్గించేస్తున్నారు. దీనికి తోడు ఈసారి నాకు భారత జట్టులో ఆడిన అనుభవం కూడా వచ్చింది. నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యింది. అది మా జట్టుకు కలిసివచ్చే అంశం. జట్టులో యువ ఆటగాళ్లతో పాటు కొంతమంది సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. వాళ్ల అనుభవం నాకు బాగా పనికొస్తుంది. వాళ్లు నా నిర్ణయాలను గౌరవిస్తారు. నాకు ఎల్లప్పుడూ మద్దతిస్తుంటారు. అవసరమైనప్పుడు నేనే వాళ్లదగ్గరికి వెళ్లి సూచనలు తీసుకుంటా. అలాగే జట్టులో ఏ ఒక్క ఆటగాడిని ఫలానా అని ముద్ర వేయాల్సిన అవసరం కెప్టెన్‌గా నాకు లేదు. ఈసారి ఐపీఎల్‌లో కొన్ని రికార్డులు తిరగరాయాలని నిర్ణయించుకున్నాం."