అడిలైడ్‌లో ఘోర పరాభవం పాలైన టీమ్‌ఇండియా మెల్‌బోర్న్ టెస్టుతో సత్తా చాటిందని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కొనియాడాడు. అజింక్య రహానె సారథ్యంలో భారత జట్టు బలంగా పుంజుకుందని చెప్పాడు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన అక్తర్.. తాత్కాలిక కెప్టెన్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. ఏ జట్టు అయినా ఇలా సత్తా చాటితే తనకు ముచ్చటేస్తుందన్నాడు. రహానె జట్టు బాధ్యతల్ని తనపై వేసుకొని మ్యాచ్‌ను మలుపు తిప్పాడని అక్తర్ ప్రశంసించాడు.
వావ్.. రహానె సారథ్యంలో అదుర్స్: అక్తర్ - బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వార్తలు
టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్ అజింక్య రహానెపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రశంసలు కురిపించాడు. తొలి టెస్టులో భారత జట్టు ఓటమి పాలైనా.. రెండో టెస్టులో తిరిగి పుంజుకుందని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌గా రహానె వ్యూహాలు, ఫీల్డింగ్ మార్పులు అద్భుతంగా పనిచేశాయని అన్నాడు.
"భారత్ తిరిగి సత్తా చాటింది, దాంతో ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో కట్టడి చేసింది. అడిలైడ్‌లో ఘోర ఓటమి తర్వాత భారత్ తిరిగి పుంజుకుందనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. అలాగే కెప్టెన్‌గా రహానె మంచి పని చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతడి వ్యూహాలు, ఫీల్డింగ్ మార్పులు అద్భుతం. ఈ మ్యాచ్‌కు ముందు అతడెంతో ఒత్తిడిలో ఉన్నాడు. అయినా ప్రశాంతంగా ఉంటూ తన పరిణతిని ప్రదర్శించాడు. కెప్టెన్ల వ్యవహార శైలితోనే జట్లు మెరుగవుతాయి. ఇక తొలి ఇన్నింగ్స్‌లో జడేజా బాగా ఆడాడు. రహానె(112) శతకంతో భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు," అని అక్తర్ పేర్కొన్నాడు.
ఇదీ చూడండి:ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాను: కోహ్లీ