మహిళల క్రికెట్లో కొత్త రూల్స్‌కు బదులుగా ప్రచారంతో అభిమానులను మరింతగా స్టేడియాలకు రప్పించవచ్చని అభిప్రాయపడింది టీమ్ఇండియా బౌలర్ శిఖా పాండే. ఇప్పటికే ఉమెన్స్ గేమ్‌లో చిన్న బంతిని ప్రవేశపెట్టడం సహా పిచ్ పరిమాణం తగ్గించి మ్యాచ్‌లు నిర్వహించాలన్న సూచనలు వెల్లువెత్తుతున్నాయి. దీని ద్వారా మహిళల మ్యాచ్‌లకు మరింత ప్రేక్షకాదరణ ఉంటుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై తాజాగా ట్విట్టర్లో స్పందించింది శిఖా పాండే.
"100మీ, 400మీ వంటి ఒలింపిక్ పరుగుపందేల్లో పురుషులు, మహిళలు ఒకే దూరం పరుగెత్తుతారు కదా! మరి క్రికెట్లో పిచ్ పరిధిని తగ్గించడం ఎందుకు? బంతి పరిమాణం తగ్గించడం అంగీకారమే. కానీ, సైజ్ తగ్గినా బంతి అంతే బరువు ఉండేలా చూడాలని, అలా చేస్తేనే బౌండరీలు ఎక్కువ వచ్చే అవకాశంతో పాటు బౌలర్లకు గ్రిప్ సహకరిస్తుందని ఇయాన్ స్మిత్ తెలిపాడు. మహిళల మ్యాచ్‌ల్లో వృద్ధి కావాలంటే తగిన ప్రచారం అవసరం. కొత్త నిబంధనలను ప్రవేశపెట్టడం వల్ల ప్రేక్షకులను ఆకర్షించలేం".
- శిఖా పాండే, టీమ్ఇండియా బౌలర్
ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్‌తో జరిగిన ఫైనల్లో భారత్ తలపడింది. ఆ మ్యాచ్‌ను చూడటానికి ఏకంగా 86,174 మంది వీక్షకులు హాజరయ్యారు. ఆ మ్యాచ్‌లో భారత్‌పై ఆసీస్ విజయం సాధించి ట్రోఫీని గెలుచుకుంది.