శ్రీలంక ఆటగాళ్లు పాకిస్థాన్ పర్యటనకు రావడానికి వెనుకడుగు వేస్తున్నాయి. అందుకు కారణం ఐపీఎల్ అని అంటున్నాడు పాక్ మాజీ ఆటగాడు అఫ్రిదీ. ఐపీఎల్ ఫ్రాంఛైజీలు లంక ఆటగాళ్లపై ఒత్తిడి తీసుకొస్తున్నాయని అన్నాడు.
"శ్రీలంక ఆటగాళ్లపై ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడటానికి లంక ఆటగాళ్లతో మాట్లాడినపుడు వారు ఇదే విషయం చెప్పారు. పీఎస్ఎల్లో ఆడటానికి మీరు పాక్ వెళితే మీకు కాంట్రాక్ట్ దక్కదు అని ఫ్రాంఛైజీలు ఆటగాళ్లకు చెబుతున్నాయి.''
-షాహిద్ అఫ్రిదీ, పాక్ మాజీ ఆటగాడు
పాక్ పర్యటనకు దూరంగా ఉన్న క్రికెటర్లలో లంక జట్టు వన్డే, టీ20 కెప్టెన్ మలింగ, దిముత్ కరుణరత్నేతో పాటు తిసార పెరీరా, మాథ్యూస్, నీరోషాన్ డిక్వెలా, కుషాల్ పెరీరా, ధనంజయ డిసిల్వా, అఖిల ధనంజయ, సురంగ లక్మల్, దినేశ్ చండీమల్ ఉన్నారు. కానీ ఇందులో ఐపీఎల్ కాంట్రాక్ట్ ఉంది కేవలం మలింగకు మాత్రమే. అఖిల ధనంజయను 2018లో ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసినా చివరి సీజన్లో వదులుకుంది. ఈ కారణంగా అఫ్రిదీ చెప్పిన ఈ మాటలు నమ్మశక్యంగా లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు.