సచిన్‌ను చూస్తూ లేడీ మాస్టర్‌గా ఎదిగిన షెఫాలి 15 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు.. స్కూల్లో స్నేహితులతో సరదాగా గడుపుతూ.. చదువుల్లో మునిగితేలుతుంటారు. కానీ టీమిండియా మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ మాత్రం అంతర్జాతీయ క్రికెట్లో రికార్డులు సృష్టిస్తోంది.
ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో రికార్డు అర్ధశతకం సాధించిన షెఫాలీ తల్లిదండ్రులతో 'ఈటీవీ భారత్' ముచ్చటించింది. ఆమెకు సంబంధించిన విశేషాలను తెలుసుకుంది.
అతితక్కువ వయసులో అర్ధశతకం చేసిన భారత క్రికెటర్‌గా నిలిచింది షెఫాలీ వర్మ. 30 ఏళ్లుగా ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ రికార్డును బద్దలు కొట్టింది. ఈ ఘనత సాధించడంపై ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
హరియాణాలోని రోహతక్‌లో పుట్టిన షెఫాలీ.. సచిన్‌ను చూస్తూ క్రికెట్ పట్ల ఆసక్తి పెంచుకుంది. అతడి ఆటంటే ఆమెకు ఎంతో ఇష్టమని తల్లి పర్వీన్ బాలా చెప్పారు.
మాస్టర్‌ను ఆదర్శంగా తీసుకొని క్రికెట్లో ఓనమాలు దిద్దిన షెఫాలీ.. ఇప్పుడు అంతర్జాతీయ రికార్డులు అందుకోవడం గర్వంగా ఉందని తండ్రి సంజీవ్ అన్నారు. ఇలాంటి మరెన్నో ఘనతలు అందుకుంటుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో 43 బంతుల్లో 79 పరుగులు చేసి షెఫాలీ.. 30 ఏళ్లుగా ఉన్న సచిన్ రికార్డును అధిగమించింది. రెండో టీ20లోనూ 35 బంతుల్లో 69 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో.. ప్రస్తుతం 2-0 తేడాతో ముందంజలో ఉంది భారత్.
స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్తో టీ20ల్లోకి వచ్చింది షెఫాలీ. ప్రస్తుతం ఆమె స్థానంలో ఆడుతోంది. గత నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అరంగేట్రం చేసింది.
ఇదీ చదవండి: ప్రపంచ పారా అథ్లెట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం