అతడి పేరు విరాట్ కోహ్లి.. కానీ అభిమానులు మాత్రం 'కింగ్' కోహ్లి అంటారు!
ఊరికే వచ్చేసిందా అతడికా పేరు..?
కెరీర్‌లో ఎప్పటికీ మరిచిపోలేని ఓ ఘోర వైఫల్యం వెంటాడుతున్న వేళ.. తన సామర్థ్యం మీద తనకే సందేహాలు తలెత్తిన సమయాన.. భారత బ్యాట్స్‌మెన్‌కు సవాలు విసిరే ఓ దేశంలో.. అత్యుత్తమ బౌలింగ్ శ్రేణిని ఎదుర్కొంటూ అతను చూపించిన ఆధిపత్యానికి, సాగించిన పోరాటానికి క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. అప్పట్నుంచే అతణ్ని 'కింగ్ కోహ్లి' అని పిలవడం మొదలుపెట్టింది.
అప్పటికి వన్డేల్లో గొప్ప స్థాయిని అందుకున్నా.. టెస్టుల్లో మాత్రం విరాట్ కోహ్లి ఒక సాధారణ బ్యాట్స్‌మనే. కొన్ని సిరీస్‌ల్లో మంచి ప్రదర్శనే చేసినా.. టీమ్‌ఇండియాకు సవాలుగా మారిన ఇంగ్లాండ్ పర్యటనలో అతను ఘోరాతి ఘోరంగా విఫలమయ్యాడు. 5 టెస్టుల్లో 13.4 సగటుతో 134 పరుగులు.. కోహ్లి ఓ సిరీస్‌లో ఇలాంటి గణాంకాలు నమోదు చేశాడంటే ఇప్పుడు నమ్మశక్యంగా అనిపించదు. సచిన్ వారసుడంటూ కోహ్లి గురించి వినిపిస్తున్న వ్యాఖ్యానాలకు తెరదించిన సిరీస్ అది.
ఆత్మవిశ్వాసం తొణికిసలాడే విరాట్.. తన మీద తాను పూర్తిగా నమ్మకం కోల్పోయాడు ఆ సిరీస్‌తో. అక్కడ 1-3తో సిరీస్ చేజార్చుకున్నాక.. ఆస్ట్రేలియాకు వచ్చింది ధోని నేతృత్వంలోని భారత జట్టు. మరోవైపు ఆస్ట్రేలియా ఈ సిరీస్ ముంగిట పెద్ద విషాదాన్ని చవిచూసింది. ఆ జట్టు ఓపెనర్ ఫిల్ హ్యూస్ దేశవాళీ మ్యాచ్ ఆడుతూ తలకు బౌన్సర్ తాకి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో క్లార్క్ సేన తీవ్ర భావోద్వేగాలతో సిరీస్‌కు సన్నద్ధమైంది. హ్యూస్ పేరును 13వ ఆటగాడిగా జట్టులోకి చేర్చిన కంగారూ జట్టు.. సిరీస్ గెలిచి అతడికి ఘన నివాళి అర్పించాలన్న పట్టుదలతో సిరీస్‌ను ఆరంభించింది.
తొలి టెస్టు ఆరంభం కాబోతుందనగా భారత్‌కు పెద్ద షాక్! కెప్టెన్ ధోని వేలి గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. విరాట్ తాత్కాలికంగా సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. స్టీవ్ స్మిత్ (162 నాటౌట్), వార్నర్ (145), క్లార్క్ (128) శతకాలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్లకు 517 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అప్పటికి పరిస్థితి చూస్తే.. ఇక భారత్ ప్రయత్నమంతా మ్యాచ్ కాపాడుకోవడానికే అన్న అభిప్రాయాలు కలిగాయి. కానీ కోహ్లి మాత్రం మరోలా ఆలోచించాడు. దూకుడు మంత్రాన్నే సహచరులకు ఉపదేశించాడు. కొండంత స్కోరు ముందున్నా.. అదరక బెదరక ఎలా ఆడాలో చేసి చూపించాడు. హ్యూస్ విషాదం నేపథ్యంలో బౌన్సర్లంటేనే బ్యాట్స్‌మెన్ హడలి పోతున్న ఆ సమయంలోనూ మిచెల్ జాన్సన్ షార్ట్ బంతులతో విరాట్‌ను భయపెట్టే ప్రయత్నం చేశాడు.
కానీ అతను తలొగ్గలేదు. జాన్సన్ సహా అందరు బౌలర్లనూ దీటుగా ఎదుర్కొన్నాడు. విరాట్ శతకానికి (115; 184 బంతుల్లో 12×4) విజయ్ (52), రహానె (62) అర్ధసెంచరీలూ తోడవడయ్యి భారత్ 444 పరుగులు చేసి ఆలౌటైంది. వార్నర్ (102) రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ కొట్టగా.. నాలుగో రోజు ఆట ఆఖరుకు ఆసీస్ 290/5 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. చివరి రోజు భారత్ ముందు 364 పరుగుల లక్ష్యం నిలిచింది. 90 ఓవర్లలో ఇన్ని పరుగులంటే 4కు పైగా రన్‌రేట్‌తో పరుగులు చేయాలి. నాలుగో ఇన్నింగ్స్‌లో ఒక్క రోజులో ఇంత లక్ష్యం అంటే.. ఏ జట్టయినా డ్రా కోసమే ఆడుతుంది. కెప్టెన్ కూడా జాగ్రత్తగా ఆడి డ్రా చేసుకోమనే సహచరులకు చెబుతాడు. కానీ ఓడినా పర్వాలేదు కానీ.. డ్రా కోసం ఆడకూడదన్నది విరాట్ శైలి. సహచరులకు అదే చెప్పాడు.
భారత్ రెండో ఇనింగ్స్ ఆరంభంలోనే ధావన్ (9), పుజారా (21)ల వికెట్లు కోల్పోయినా సరే.. జట్టు వైఖరి మారిపోలేదు. విజయ్ (99)కు జత కలిసిన కోహ్లి (141; 175 బంతుల్లో 16×4, 1×6) సంచలన ఇన్నింగ్స్, భారీ భాగస్వామ్యంతో మ్యాచ్ గమనాన్నే మార్చేశాడు. 242/2. ఇంకో 21 ఓవర్లు మిగిలుండగా భారత్ స్కోరిది. 8 వికెట్లు చేతిలో ఉండగా ఇంకో 122 పరుగులు చేస్తే చాలు. అద్భుత విజయం భారత్ సొంతం. ఆ స్థితిలో విజయ్ ఔటైపోయాడు. అంతే వికెట్ల పతనానికి గేట్లెత్తేసినట్లయింది. అయినా సరే.. కోహ్లి పోరాటం కొనసాగించాడు. స్కోరును 300 దాటించాడు. 4 వికెట్లుండగా విజయానికి ఇంకో 60 పరుగులే చేయాల్సిన స్థితికి చేరింది భారత్. అప్పుడే విరాట్‌ను ఔట్ చేసేశాడు లైయన్. ఇంకో 11 పరుగులకే ఇన్నింగ్స్ ముగిసిపోయింది. ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా విరాట్ చూపించిన తెగువ మాత్రం అసామాన్యం.
వారసుడొచ్చాడు
బ్రిస్బేన్‌లో జరిగిన రెండో టెస్టుకు ధోని అందుబాటులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లోనూ భారత్ బాగానే ఆడినా ఓటమి తప్పలేదు. కోహ్లి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ (19, 1) విఫలమయ్యాడు. భారత్ 4 వికెట్ల తేడాతో ఓడింది. తర్వాత మెల్‌బోర్న్‌లో మూడో టెస్టు. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్.. యధావిధిగా భారీ స్కోరు (530) చేసింది. క్లార్క్ గాయంతో కెప్టెన్‌గా పదోన్నతి పొందిన స్టీవ్ స్మిత్ (192) భీకర ఫామ్‌ను కొనసాగించాడు. అయితే తర్వాత భారత్ దీటుగా స్పందించింది. 465 పరుగులు చేసింది. బ్రిస్బేన్ వైఫల్యంతో రగిలిపోతున్న విరాట్.. కసితో ఆడాడు. భారీ శతకం (169; 272 బంతుల్లో 18×4) బాదాడు. రహానె (147) సెంచరీ అందుకున్నాడు.