పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్, తనను తాను అవమానించుకునేందుకు కొత్త మార్గాలు కనుగొంటున్నారన్నాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. అమెరికాకు చెందిన ఓ వార్తా ఛానెల్‌లో ఇమ్రాన్ మాట్లాడిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ, ఆయనకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఐరాస సర్వప్రతినిధి సభలో ఇమ్రాన్ చేసిన ప్రసంగాన్ని గుర్తుచేస్తూ, శాంతి కోరుకోవాల్సిన దేశమే ఇలాంటి అనవసరపు రాద్ధాంతం చేయడమేంటని ప్రశ్నించాడీ మాజీ క్రికెటర్. సెహ్వాగ్ వ్యాఖ్యలకు గంగూలీ మద్దతు పలికాడు.
గత నెల 26న జరిగిన ఐరాస సాధారణ సభ 74వ సమావేశాల్లో ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావించిన ఇమ్రాన్.. ఓ అంతర్జాతీయ వేదికపై రాజకీయాలు చేసే ప్రయత్నం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామోఫోబియా పెరిగిపోతోందని వ్యాఖ్యానించారు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు పెరిగే అవకాశం ఉందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రెండు అణ్వస్త్ర దేశాలు యుద్ధానికి దిగితే పరిణామాలు దారుణంగా ఉంటాయంటూ హెచ్చరించే యత్నం చేశారు.