టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. మరో దేశానికి ఆడుంటే టెస్టుల్లో 10 వేల పరుగులు పూర్తి చేసేవాడని అన్నాడు పాకిస్థాన్ మాజీ సారథి రషీద్ లతీఫ్. అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్థి జట్టు గుండెల్లో రైళ్లు పరిగెట్టేవని చెప్పాడు. వీరూ నుంచి జట్టు చాలా స్పూర్తి పొందేదని తెలిపాడు. వీటితో పాటే చాలా విషయాన్ని ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వూలో భాగంగా రషీద్ వెల్లడించాడు.
"బౌలర్లపై సెహ్వాగ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించేవాడు. ఓపెనర్ల విషయంలో మేం ఎంతో జాగ్రత్తగా ఉండేవాళ్లం. మ్యాచ్ మొదలైన తర్వాత పిచ్‌ను అంచనా వేసేందుకు కొంత సమయం పడుతుంది. మెక్‌గ్రాత్, బ్రెట్‌లీ, వసీం అక్రమ్, షోయబ్ అక్తర్.. ఇలా బౌలర్ ఎవరైనా సరే ఒకే పద్ధతి పాటించేవారు. కానీ, సెహ్వాగ్ బౌలర్ ఎవరనేది చూసేవాడు కాదు. అతనొక డాషింగ్ ప్లేయర్. వీరూ నుంచి వాళ్ల జట్టు గొప్ప స్ఫూర్తి పొందేది. టెస్టుల్లో అతను 8వేల పైచిలుకు పరుగులు చేశాడు. సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ వంటి దిగ్గజ క్రికెటర్లతో కలిసి ఆడటం వల్ల వారి తర్వాతే సెహ్వాగ్ పేరు వినిపించేది. ఒకవేళ సెహ్వాగ్ మరో దేశం తరపున ఆడి ఉంటే, టెస్టుల్లో 10 వేల పరుగులు పూర్తి చేసేవాడు. టీమిండియాలో ఎంత పెద్ద ఆటగాళ్లు ఉన్నా సరే, సెహ్వాగ్ బరిలో ఉంటే మాత్రం పత్యర్థి జట్టు గుండెల్లో రైళ్లు పరిగెట్టేవి"