టీమిండియా మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ట్వీట్లు మరోసారి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 2011లో ఇంగ్లాండ్‌లో పర్యటించిన భారత్ మూడో టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెహ్వాగ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. తనపై తానే సెటైర్ వేసుకున్నాడు. అంతేకాకుండా తనకు సెలెక్టర్ అవ్వాలని ఉన్నట్లు పరోక్షంగా ట్వీట్ చేశాడు.
" నాకు సెలక్టర్ అవ్వాలని ఉంది. కానీ నా మాట వినేదెవరు?".
- వీరేంద్ర సెహ్వాగ్, భారత మాజీ క్రికెటర్
ఇటీవల ప్రధాన కోచ్ నియామక ప్రక్రియకు దరఖాస్తుల గడువు ముగిసింది. దీనికోసం వీరేంద్ర సెహ్వాగ్ కూడా పోటీపడతాడని అందరూ భావించారు. గతంలోనూ చీఫ్ కోచ్‌గా అనిల్ కుంబ్లే పదవీకాలం ముగిశాక ఆ పోస్టులో పనిచేసేందుకు ఆసక్తి చూపించాడీ మాజీ క్రికెటర్.
వినూత్నంగా ఆర్యభట్టకు నివాళి..
2011లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్ టోర్నీ విశ్వవిజేతగా ఆవిర్భవించింది భారత్. ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో పర్యటించింది. తొలి టెస్టులో 196, రెండో టెస్టులో 319 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టు విజయం సాధించింది. ఈ రెండు టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్ ఆడలేదు. మూడో టెస్టుకు అతడిని తీసుకున్నా... ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ వేసిన తొలి బంతికే ఔట్ అయి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో ధోనీ సేన 224కు కుప్పకూలింది. ఆ తర్వాత అలిస్టర్ కుక్ (294), ఇయాన్ మోర్గాన్ (104) చెలరేగడం వల్ల 710/7 వద్ద మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది ఇంగ్లాండ్. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియాకు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది.రెండో ఇన్నింగ్స్‌లో జేమ్స్ అండర్సన్ వేసిన తొలి బంతికే వీరూ మళ్లీ డకౌట్ అయ్యాడు. రెండు ఇన్నింగ్సుల్లోనూ తొలి బంతికే ఔటై 'కింగ్ పెయిర్' నమోదు చేశాడు.
అందుకే ఆగస్ట్ 12వ తేదీనీ సరదాగా గుర్తు చేసుకుంటూ సెహ్వాగ్ తనపై తానే ఛలోక్తి విసురుకున్నాడు.
" 8 ఏళ్ల క్రితం ఇదే రోజున ఇంగ్లాండ్‌పై బర్మింగ్‌హామ్‌లో కింగ్ పెయిర్ నమోదు చేశాను. నాకు ఇష్టం లేకపోయినా ఆర్యభట్టకు నివాళి అర్పించాను. విఫలమయ్యేందుకు సున్నా అవకాశాలుంటే నువ్వేం చేస్తావ్? " .
- వీరేంద్ర సెహ్వాగ్, భారత మాజీ క్రికెటర్
భారత ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆర్యభట్ట సున్నా ప్రాధాన్యతను వివరించి గణితశాస్త్రాన్ని కొత్త పుంతలు తొక్కించారు.