టీమిండియా సీనియర్ బ్యాట్స్మెన్ సురేశ్ రైనాకు ఇటీవల మోకాలి శస్త్రచికిత్స జరిగింది. 2007లో తొలిసారి సర్జరీ చేయించుకున్న ఈ ఆటగాడు.. మరోసారి ఆపరేషన్ చేయించుకున్నాడు. ప్రస్తుతం దేశవాళీ మ్యాచ్‌లు ఆడుతున్న రైనా... కొన్నాళ్లు ఆటకు దూరమవుతానని తెలిసినా కీలక నిర్ణయం తీసుకున్నట్లు అభిప్రాయపడ్డాడు. కనీసం నాలుగు నుంచి ఆరు వారాలపాటు క్రికెట్‌కు దూరంగా ఉండాలని అతడికి వైద్యులు సూచించారు.
"రెండోసారి మోకాలి శస్త్రచికిత్స అంటే నిజంగా కష్టమే, అయినా కఠిన నిర్ణయం తీసుకున్నా. ఎందుకంటే కొన్ని నెలలు ఆటకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అయితే నొప్పి పెరిగిపోవడం వల్లే ఇలా ఆలోచించా. నేను తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్న స్నేహితులకు, అభిమానులకు ధన్యవాదాలు. శస్త్ర చికిత్సను విజయవంతం చేసిన వైద్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు. నా మోకాలికి 2007లోనే సమస్య మొదలైంది. అప్పట్లోనే సర్జరీ చేయించుకుని బరిలోకి దిగా. అప్పుడు వంద శాతం ప్రదర్శన చేశానంటే ఆ ఘనత డాక్టర్లు, శిక్షకులదే. క్రికెట్‌కు దూరంగా ఉన్న నేను త్వరలోనే కోలుకుని మళ్లీ మైదానంలో అడుగుపెడతానని ఆశిస్తున్నా" -సురేశ్ రైనా, భారత క్రికెటర్