భారత్‌లో తొలి డే/నైట్ టెస్టు నిర్వహించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా నవంబర్ 22 నుంచి 26 వరకు జరగనున్న టెస్టు మ్యచ్‌లో గులాబీ బంతితో ఆడనున్నాయి టీమిండియా-బంగ్లాదేశ్. ఈ మేరకు భారత బోర్డు చేసిన ప్రతిపాదనకు బంగ్లాదేశ్ బోర్డు అంగీకరించినట్లు దాదా.. మంగళవారం వెల్లడించాడు.
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ "టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు డే/నైట్ మ్యాచ్ సరైన నిర్ణయం. నేను, నా బృందం దీని కోసం ప్రయత్నించి విజయవంతమయ్యాం. ఈ నిర్ణయానికి ఒప్పుకున్న విరాట్కోహ్లీకి నా కృతజ్ఞతలు తెలుపుతున్నా"
--గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
ఫ్లడ్‌లైట్ల కింద టెస్టు ఆడేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇటీవలే ఒప్పుకున్నాడు. ఈ బంతితో ప్రాక్టీస్ లేకపోవడం సమస్యగా భావించిన బంగ్లా క్రికెటర్లు తొలుత వ్యతిరేకించారు. అయితే తర్వాత ఆ జట్టు యాజమాన్యం వారిని ఒప్పించగలిగింది.
ఈ మ్యాచ్‌కు ఒలింపిక్స్ పతక విజేతలు అభినవ్ బింద్రా(షూటర్), మేరీకోమ్(బాక్సర్), పీవీ సింధు(బ్యాడ్మింటన్)హాజరు కానున్నారు. వారందరికీఈడెన్లో ప్రత్యేక సత్కారం ఏర్పరిచింది బీసీసీఐ.
ఫ్లడ్‌లైట్ వెలుతురులో తొలిసారి డే/నైట్ టెస్టు దులీప్ ట్రోఫీలో..
టెస్టు ఫార్మాట్‌ను ఆసక్తికరంగా మార్చేందుకు కొన్నేళ్ల కిందట ఐసీసీ.. గులాబీ బంతితో డే/నైట్ టెస్టు ఆలోచన చేసింది. 2015లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య ఫ్లడ్‌లైట్ల వెలుతురులో, గులాబీ బంతులతో తొలి టెస్టు జరిగింది. భారత్.. గత ఏడాది ప్రయోగాత్మకంగా దులీప్ ట్రోఫీ ఫైనల్‌ను డే/నైట్‌లో నిర్వహించింది. కానీ గులాబీ బంతులు అంత నాణ్యంగా లేవనే కారణంతో భారత్ ప్రతిసారీ డే/నైట్ టెస్టు ప్రతిపాదనలను తిరస్కరిస్తూ వచ్చింది.
గత ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భాగంగా ఇదే విధంగా మ్యాచ్ ఆడాలని క్రికెట్ ఆస్ట్రేలియా కోరినాబీసీసీఐ అంగీకరించలేదు. ఇప్పటివరకు భారత్, బంగ్లాదేశ్ తప్ప టెస్టు హోదా ఉన్న అన్ని దేశాలూ డే/నైట్ టెస్టులు ఆడాయి.