రంజీ ఫైనల్లో తలపడే తుది జట్లు ఎవరన్నది తేలిపోయింది. రాజ్‌కోట్ వేదికగా బుధవారం జరిగిన సెమీస్‌లో సౌరాష్ట్ర జట్టు 92 పరుగుల తేడాతో గుజరాత్‌పై గెలిచింది.
రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ జైదేవ్ ఉనద్కత్ (7/56) ఏడు వికెట్లతో విజృంభించి, తమ జట్టుకు విజయాన్ని అందించాడు. ఒక రంజీ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో 65 వికెట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచాడు. అశుతోష్ అమన్ (బిహార్) 68 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
పోరాడిన పార్థివ్
327 పరుగుల ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 7/1తో చివరి రోజు ఆట కొనసాగించిన గుజరాత్.. రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ పార్థివ్ పటేల్ (93), చిరాగ్ గాంధీ (96) పోరాడినా ఫలితం లేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 304 పరుగులు చేయగా.. గుజరాత్ 252కు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 274 పరుగులకు పరిమితమైంది.
తాజా విజయంతో సౌరాష్ట్ర వరుసగా రెండో సీజన్‌లోనూ రంజీ ట్రోఫీ ఫైనల్లో అడుగుపెట్టింది. సోమవారం(మార్చి 9న) ఆరంభమయ్యే టైటిల్ పోరులో బంగాల్‌తో సౌరాష్ట్ర తలపడనుంది.
బంగాల్ 18 ఏళ్ల కల సాకారం చేసిన ట్యాక్సీ డ్రైవర్ కొడుకు