గతేడాది జరిగిన ప్రపంచకప్ తర్వాత పాకిస్థాన్ క్రికెటర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది పీసీబీ. అన్ని ఫార్మాట్లకు కొత్త కెప్టెన్లను నియమించింది. అయితే జట్టులోకి తీసుకోవడంలోనూ ఆలోచనలో పడింది. తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టెస్టు సిరీస్‌కు సర్ఫరాజ్ అహ్మద్ ఎంపికైనా తుది జట్టులో మాత్రం చోటు కష్టంగానే మారింది. ఇంగ్లీష్ జట్టుతో జరిగిన తొలి టెస్టులో 12వ ఆటగాడిగా సహచర ఆటగాళ్లకు కూల్‌డ్రింక్స్ అందిస్తూ కనిపించాడీ మాజీ కెప్టెన్. తాజాగా ఈ విషయమై స్పందించాడు పాక్ మాజీ సారథి రమీజ్ రాజా.
"సర్పరాజ్ వీలైనంత త్వరగా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి పూర్తి దృష్టి పరిమిత ఓవర్ల సిరీస్‌లపై కేటాయించాలి. ఎందుకంటే ఈ ఫార్మాట్లో అతడు బాగా రాణించగలడు. ఇదే నేను అతడికిచ్చే సలహా. సహచర ఆటగాళ్లకు కూల్‌డ్రింక్స్ అందించడంలో తప్పులేదు. ఇంగ్లాండ్ పేసర్ అండర్సన్ కూడా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో అదే పని చేశాడు. అయితే ఓ మాజీ కెప్టెన్ ఇటువంటి పనులు చేయడాన్ని మనం తప్పుగా చూస్తాం. నాకు తెలిసి సర్ఫరాజ్‌కు ఇక టెస్టుల్లో చోటు దక్కదు."