తెలంగాణ

telangana

ETV Bharat / sports

కపిల్​ ​బృందంపై ఫిర్యాదు- కోచ్ ఎంపిక ఎలా? - kapil team

భారత మాజీ క్రికెటర్​ కపిల్​దేవ్ బృందం​పై బీసీసీఐ నైతిక విలువల కమిటీ అధికారికి ఫిర్యాదు చేశాడు మధ్యప్రదేశ్ క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యుడు సంజీవ్‌ గుప్తా. కపిల్ జట్టు​ పరస్పర విరుద్ధ ప్రయోజనాన్ని పొందుతున్నట్లు ఆరోపించాడు.

కపిల్​ ​బృందంపై 'పరస్పర విరుద్ధ ప్రయోజన' ఫిర్యాదు

By

Published : Jul 28, 2019, 2:40 PM IST

భారత క్రికెట్​ జట్టు కోచ్‌ ఎంపిక బాధ్యతను బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) కపిల్‌దేవ్‌ బృందానికి అప్పగించింది. ఈ విషయంపై బీసీసీఐ నైతిక విలువల కమిటీ అధికారి జస్టిస్ డీకే జైన్​కు ఫిర్యాదు చేశాడు మధ్యప్రదేశ్ క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యుడు సంజీవ్‌ గుప్తా.

జస్టిస్​ డీకే జైన్​

కోచ్‌ ఎంపిక బాధ్యతను కపిల్‌ బృందానికి ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. నిబంధనల ప్రకారం క్రికెట్‌ సలహా కమిటీని నియమించే అధికారం సీఓఏకు లేదని తెలిపాడు.

" బీసీసీఐ నిబంధన 26(2)-ఏ(ii) ప్రకారం క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ)ని నియమించే అధికారం సీఓఏకు లేదు. ఈ అధికారం బీసీసీఐ ఏజీఎమ్‌కు మాత్రమే ఉంది. గతంలో మహిళా జట్టు కోచ్​ డబ్ల్యూవీ రామన్‌ నియమాకం రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది. మరోసారి అటువంటి పరిస్థితి ఏర్పడుతోంది".
- సంజీవ్‌ గుప్తా, మధ్యప్రదేశ్ క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యుడు

పరస్పర విరుద్ధ ప్రయోజనం:

బీసీసీఐ నూతన నిబంధనల ప్రకారం ఏ వ్యక్తి రెండు పదవుల్లో ఉండకూడదు. ఎవరైనా ఆ విధంగా ఉంటే పరస్పర విరుద్ధ ప్రయోజనం కింద భావించి ఏదో ఒక అధికారం వదులుకోవాల్సి ఉంటుంది. ఈ నియమం వల్లే గతంలో క్రికెట్​ సలహా కమిటీలో ఉండే సచిన్​, లక్ష్మణ్​, గంగూలీ బృందం ఆ పదవి నుంచి తప్పుకుంది. ఈ త్రయం వైదొలిగిన తర్వాత టీమిండియా జట్టు కోచ్​ ఎంపిక కోసం తాత్కాలిక సీఏసీ కమిటీని ఏర్పాటు చేసింది బీసీసీఐ పాలకుల కమిటీ. ఇందులో కపిల్​దేవ్​, శాంతా రంగస్వామి, అన్షుమన్​ గైక్వాడ్​ సభ్యులు. అయితే ఈ కొత్త బృందం నిబంధన 38(4)ను ఉల్లంఘిస్తున్నట్లు పేర్కొన్నాడు గుప్తా.

కపిల్​, అన్షుమన్​, శాంత

" బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒకే అధికారంలో ఉండాలి. కానీ కపిల్‌ దేవ్‌, శాంతా రంగస్వామి ఇండియన్‌ క్రికెటర్‌ అసోసియేషన్‌కు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. అన్షుమన్‌ గైక్వాడ్‌ బీసీసీఐ అనుబంధ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. వీళ్లందరూ ఈ పదవుల్లో ఉంటూనే సలహా కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అందుకే ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనం కిందకు వస్తుంది" అని వివరించాడు సంజీవ్​ గుప్తా.

ABOUT THE AUTHOR

...view details