తెలంగాణ

telangana

ETV Bharat / sports

ద్రవిడ్‌పై సచిన్‌ అలిగిన వేళ! - ముల్తాన్​ టెస్టు సచిన్​ ద్రవిడ్​

పాకిస్థాన్​తో జరిగిన ఓ మ్యాచ్​ కారణంగా టీమ్​ఇండియా దిగ్గజ ఆటగాళ్లు సచిన్​ తెందుల్కర్​, రాహుల్​ ద్రవిడ్​ మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అప్పుడు భారత జట్టు రెండు వర్గాలుగా చీలిపోతుందేమో అనుకున్నారంతా. ఇంతకీ ఆ పోరు ఎప్పుడు జరిగింది? అసలు ఆ వివాదం ఏమిటి?

sachin
సచిన్​

By

Published : Feb 3, 2021, 5:59 PM IST

2004.. చిరకాల శత్రువు పాకిస్థాన్‌లో భారత్‌ అడుగుపెట్టి అప్పటికే 15 ఏళ్లు గడిచింది. అందుకే రెండు దేశాల క్రికెటర్లే కాదు అభిమానులు, రాజకీయ నాయకులూ అత్యంత ఉత్కంఠను అనుభవించారు. ఆ హోరాహోరీ సిరీసులో ద్విశతకం చేసే అవకాశం దొరికితే ఎవరు వదిలేస్తారు చెప్పండి! దాయాదిని సొంతగడ్డపై ఓడించే ఆధిపత్యం లభిస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి! కానీ ఆ రెండు సందర్భాలు టీమ్‌ఇండియాకు ఏళ్ల తరబడి అండగా నిలిచిన సచిన్‌, ద్రవిడ్‌ మధ్య మనస్పర్ధలకు కారణమయ్యాయి. జట్టు రెండు వర్గాలుగా చీలిపోతుందేమోనన్న భయం కలిగింది. మరి ఆ విపత్కర పరిస్థితులు ఎలా చల్లబడ్డాయంటే..!

సచిన్​ ద్రవిడ్​

ముల్తాన్‌ 'సుల్తాన్‌'

మూడు టెస్టుల సిరీసులో మొదటి మ్యాచుకు ముల్తాన్‌ వేదిక. సౌరవ్‌ గంగూలీ గాయపడటం వల్ల రాహుల్‌ ద్రవిడ్‌ ఈ పోరుకు సారథ్యం వహించాడు. టాస్‌ గెలిచిన వెంటనే బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఆకాశ్‌ చోప్రా, వీరేంద్ర సెహ్వాగ్‌ ఓపెనింగ్‌కు దిగారు. సొంతగడ్డపై తమ బౌలింగ్‌కు తిరుగులేదన్న పాక్‌కు వీరేంద్రుడు చుక్కలు చూపించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో వేగానికి పెద్దపీట వేశాడు. 43 ఓవర్లకు టీమ్‌ఇండియా 173/2తో నిలిచింది. కానీ అప్పుడే మొదలైంది పరుగుల వరద. ముల్తాన్‌లో సెహ్వాగ్‌ సునామీ సృష్టించాడు. మొదట 107 బంతుల్లో 100తో మొదలుపెట్టాడు. ఆ తర్వాత 150 బంతుల్లో 150కి చేరువయ్యాడు. 222 బంతుల్లో 200 సాధించేశాడు. మరికాసేపటికే పాక్‌పై పాక్‌లో అత్యధిక పరుగులు చేసిన సంజయ్‌ మంజ్రేకర్‌ (221) రికార్డును తుడిచేశాడు. దాంతో తొలిరోజు టీమ్‌ఇండియా 356 పరుగులు చేసేసింది.

సచిన్​, లక్ష్మణ్​, యూవీ

'300' వీరుడు

ఇక రెండోరోజూ వీరూది అదే జోరు. కుదిరితే బౌండరీ.. లేదంటే సిక్సర్‌.. దంచికొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. 299 బంతుల్లో 250 మైలురాయి చేరుకున్నాడు. మరోవైపు సచిన్‌ 209 బంతుల్లో 100తో అండగా ఉన్నాడు. భోజన విరామానికి టీమ్‌ఇండియా 467/2తో వెళ్లింది. అప్పటికి వీరూ 292*, సచిన్‌ 106*తో నిలిచారు. భోజనం చేసి రాగానే సెహ్వాగ్‌ త్రిశతకం చేసేశాడు. 364 బంతుల్లో 300 చేసి భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. లక్ష్మణ్‌ 281 రికార్డును చెరిపేశాడు. సిక్సర్‌తో వీరూ త్రిశతకం అందుకోవడం ఔరా! అనిపించింది. ఆసీస్‌ విధ్వంసకర వీరుడు మాథ్యూ హెడేన్‌ రికార్డునూ తుడిచి పెడతాడునుకుంటే 309 వద్ద అతడిని మహ్మద్‌ సమి ఔట్‌చేశాడు. అప్పటికి భారత స్కోరు 509/3. ఈ క్రమంలో వీవీఎస్‌ లక్ష్మణ్‌ (29) అండతో సచిన్‌ 150 దాటేశాడు. 565 వద్ద లక్ష్మణ్‌ ఔటవ్వడం వల్ల యువరాజ్‌ సింగ్‌ క్రీజులోకి వచ్చాడు. అప్పుడు మొదలైంది అసలు కథ.

సెహ్వాగ్​

విస్తుపోయిన సచిన్‌

రెండో రోజు తేనీటి విరామానికి 148 ఓవర్లకు టీమ్‌ఇండియా 588/4తో నిలిచింది. సచిన్‌ 165*తో ఉన్నాడు. నిజానికి అప్పటికే డిక్లేర్‌ చేస్తే బాగుంటుందని కోచ్‌ జాన్‌రైట్‌ భావించాడు. కానీ పాకిస్థాన్‌ను మరికాసేపు ఫీల్డింగ్‌ చేయించి ఆఖరి 15-16 ఓవర్లు ఆడించాలన్నది ద్రవిడ్‌ ప్రణాళిక. సమయం మరీ ఎక్కువ లేకపోవడం వల్ల వేగంగా ఆడాలన్న సందేశాలు సచిన్‌, యువీకి అందుతున్నాయి. అందుకు తగ్గట్టే వారూ వేగంగా ఆడుతున్నారు. 157.3 ఓవర్లకు భారత్‌ 650కి చేరుకుంది. యువరాజ్‌ 53 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. సచిన్‌ 190ని దాటేశాడు. మరో 3 ఓవర్లు.. మరో 2 ఓవర్లు అంటూ ద్రవిడ్‌ సందేశాలు పంపిస్తూనే ఉన్నాడు. 161 ఓవర్లు ముగిశాయి. సచిన్‌ 194 వద్ద ఉండగా ఇమ్రాన్‌ ఫర్హాత్‌ వేసిన తర్వాతి ఓవర్లో యువీ బ్యాటింగ్‌ చేశాడు. తొలి రెండు బంతులు డాట్‌ అయ్యాయి. మూడో బంతికి 2 పరుగులు తీశాడు. నాలుగో బంతికి పరుగు రాలేదు. దాంతో ఐదో బంతిని ఆడేందుకు ప్రయత్నించి బౌలర్‌కే క్యాచ్‌ ఇచ్చాడు. నిజానికి ఆ ఓవర్లో ఒక్క బంతీ ఆడకపోవడం వల్ల తనకు మరో 6 బంతులైనా ఇస్తారేమోనని సచిన్‌ అనుకున్నాడు. ద్విశతకం చేయొచ్చన్నది అతడి భావన. కానీ యువీ వచ్చేస్తుండగా ద్రవిడ్‌ చేతులూపుతూ సచిన్‌నూ రమ్మనడం వల్ల వివాదం చెలరేగింది.

సెహ్వాగ్​

భయపడ్డా..!

టీమ్‌ఇండియాకు సచిన్‌, ద్రవిడ్‌ వెన్నెముక లాంటివాళ్లు. జట్టు కష్టాల్లో పడ్డప్పుడు ఎన్నోసార్లు ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి చక్కని భాగస్వామ్యాలు నిర్మించారు. అలాంటిది తన ద్విశతకానికి మరో ఓవర్‌ ఇవ్వకపోవడం వల్ల నిరాశకు గురయ్యానని సచిన్‌ చెప్పాడు. అయితే మాస్టర్‌ అవమానకరంగా భావించాడని కోచ్‌ జాన్‌రైట్‌ కొన్నాళ్ల క్రితం తన ఆత్మకథలో ప్రస్తావించాడు. జట్టు రెండు వర్గాలుగా విడిపోతుందో ఏమోనని భయపడ్డామన్నాడు. పరిస్థితి వేడిగా ఉండటం వల్ల సచిన్‌తో మాట్లాడి సర్దిచెప్పాలని ద్రవిడ్‌కు సూచించాడు. ద్రవిడ్‌ మాట్లాడినప్పుడు మైదానంలో ఎప్పటిలాగే ఉంటానని బయట మాత్రం కొంత ఒంటరిగా వదిలేయాలని సచిన్‌ చెప్పాడని తెలిసింది. ఆ తర్వాత మీడియాలో ఈ సంఘటనపై దుమార రేగడం గమనార్హం. తన ఆత్మకథ 'ప్లేయింగ్‌ ఇట్‌ మై వే'లోనూ దీనిపై మాస్టర్‌ ప్రస్తావించాడు. ఆ సమయంలో బాధ కలిగినా తర్వాత టీమ్‌ఇండియా వాల్‌తో కలిసి ఎన్నో భాగస్వామ్యాలు పంచుకున్నానని, స్నేహం ఎప్పటిలాగే కొనసాగుతోందని రాశాడు. తాము గెలుపుపై పట్టుదలతో ఉన్నామని చెప్పేందుకే ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశానని, సహచరుల మధ్య అభిప్రాయభేదాలు సహజమేనని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. ఏదేమైనప్పటికీ పరిస్థితి చల్లబడింది. టీమ్‌ఇండియా ఆ సిరీసు గెలిచి చరిత్ర సృష్టించింది.

టీమ్ఇండియా

ఇదీ చూడండి : గోల్ఫ్‌ ఆడిన దిగ్గజ క్రికెటర్స్​ సచిన్​, యూవీ

ABOUT THE AUTHOR

...view details