సచిన్, లారాల్లో ఉత్తమ బ్యాట్స్‌మెన్ ఎవరంటే తేల్చుకోవడం కష్టమేనని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జాసన్ గిలెస్పీ అన్నాడు. లారాను ఔట్ చేయడం కంటే సచిన్ వికెట్ తీయడం మరింత కష్టతరం అని అభిప్రాయపడ్డాడు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సచిన్ తెందుల్కర్, బ్రియాన్ లారాల్లో ఎవరు కఠినమైన ప్రత్యర్థి అని గిలెస్పీని ప్రశ్నించగా ఈ విధంగా స్పందించాడు.
"వారిద్దరూ (సచిన్, లారా) భిన్నమైన ఆటగాళ్లు. వారిని ఔట్ చేయడం చాలా కష్టం. లారాతో పోల్చుకుంటే సచిన్ వికెట్ తీయడం మరింత కష్టతరమని ఎప్పుడూ అనుకునే వాడిని. సచిన్ కంటే లారా వికెట్ తీసేందుకే ఇష్టపడేవాడిని. ఎందుకంటే లారా భారీ షాట్లు ఆడతాడు. ఆ సమయంలో అతడి వికెట్ సాధించేందుకు ప్రయత్నించేవాడిని. కానీ నెమ్మదిగా ఆడే సచిన్‌ను ఔట్ చేయడం మరింత కష్టమయ్యేది. వారిద్దరూ ఎంతో గొప్ప ఆటగాళ్లు. వారిద్దరితో కలిసి ఆటలో భాగమైనందుకు గర్విస్తున్నా. అలాంటి లెజెండరీ ఆటగాళ్ల గురించి మాట్లాడడం కూడా గౌరవమే. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేసినందుకు సంతృప్తికరంగా ఉన్నాను."