తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కరోనాపై పోరాడుతున్న వీర మాతలకు వందనం'

మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ఆన్‌లైన్‌ కార్యక్రమంలో భాగంగా కరోనాపై పోరాడుతున్న తల్లులతో మాట్లాడాడు సచిన్​ తెందుల్కర్​. వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు.

sachin
సచిన్​

By

Published : May 10, 2020, 8:15 AM IST

ప్రాణాంతక కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగమైన తల్లులందరికీ సచిన్‌ తెందుల్కర్‌ ధన్యవాదాలు తెలిపాడు. నేడు మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ఆన్‌లైన్‌ కార్యక్రమంలో భాగంగా కొవిడ్‌-19పై పోరులో తమ వంతు బాధ్యతలు నిర్వర్తిస్తున్న తల్లులతో అతను మాట్లాడాడు.

"అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంక్షోభ సమయంలో తమ బాధ్యతలు నిర్వర్తించడానికి పిల్లలకు దూరంగా ఉండాల్సి వచ్చిన తల్లులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కొవిడ్‌ యోధురాళ్లు మన కోసం పోరాడుతున్నారు. నిస్వార్థమైన వాళ్ల త్యాగం, సాయం గొప్పవి" అని సచిన్‌ తెలిపాడు.

తనను ఎంతోగానో ప్రోత్సహించిన తన తల్లి.. కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్‌ చూసేందుకు స్టేడియానికి వచ్చినపుడు భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయానని సచిన్‌ చెప్పాడు.

"మహిళలే కుటుంబానికి వెన్నెముక. చిన్నతనం నుంచి మా అమ్మతో నా అనుబంధాన్ని మాటల్లో చెప్పలేను. క్రికెట్‌ ఆడతానంటే ఎంతగానో ప్రోత్సహించింది. నేను మైదానంలో ఆడుతుంటే ఏనాడూ ప్రత్యక్షంగా చూడని అమ్మ.. నా చివరి టెస్టు కోసం వాంఖడేకు వచ్చింది. అమ్మ రూపాన్ని మైదానంలోని పెద్ద తెరలపై చూసి భావోద్వేగానికి లోనయ్యా. ఓ అమ్మగా నా భార్య అంజలి కూడా తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తోంది. 'నువ్వు కెరీర్‌ చూసుకో.. పిల్లలను నే చూసుకుంట' అని నాకు భరోసానిచ్చింది" అని సచిన్‌ పేర్కొన్నాడు.

ఇదీ చూడండి : అతడు కొట్టిన ఫ్రీకిక్​ గోల్​కు జనం ఫిదా

ABOUT THE AUTHOR

...view details