ఇంట్లో ఉండడమే తనకు ఇష్టం అంటున్నాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్. తన జీవితం తెరిచిన పుస్తకమని.. రహస్యాలేమీ లేవని చెబుతున్నాడు. కరోనా కారణంగా శుక్రవారం(ఏప్రిల్ 27) పుట్టిన రోజు చేసుకోవద్దని నిర్ణయించుకున్న సచిన్.. 'ఈనాడు'తో ముఖాముఖిలో ఇంకా చాలా విషయాలు చెప్పాడు.
- గతంలో ఏప్పుడైనా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారా?
పుట్టిన రోజు సంబరాలు చేసుకోకపోవడం ఇదే ప్రథమం. కరోనా మహమ్మారిని భారతదేశం సమర్థంగా ఎదుర్కొంటోంది. ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తున్న వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, పోలీసులు, రక్షణ దళాలకు నా సెల్యూట్. వారికి సంఘీభావం తెలపడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా. ప్రతి రోజును బహుమతిగా భావిస్తా. అదృష్టంగా స్వీకరిస్తా.
- లాక్‌డౌన్ వల్ల క్రీడాకారులకు నష్టం కలుగుతుందని అనుకుంటున్నారా?
ప్రతి ఒక్కరికి కష్టకాలమిది. క్రీడాకారులతో పాటు ప్రతి ఒక్కరు లాక్‌డౌన్‌లో ఉన్నారు. అందరూ కరోనా మహమ్మారితో పోరాడాలి. నాకేం కాదు.. బయటకి వెళ్తానంటే కుదరదు. అలాంటి ప్రవర్తన మనకు.. కుటుంబ సభ్యులకు.. ఇంటికి.. వీధికి.. నగరానికి.. రాష్ట్రానికి.. దేశానికి చేటు. విడివిడిగా కాకుండా అందరం సమష్టిగా పోరాడాల్సిన సమయమిది. కలిసికట్టుగా కరోనాను నిర్మూలించాలి. ఒకరినొకరం కాపాడుకుంటూనే దేశాన్ని రక్షించాలి.
- శారీరక.. మానసిక ఫిట్‌నెస్ కాపాడుకునే విషయంలో యువ క్రీడాకారులకు మీరిచ్చే సలహాలేంటి?
కొంతమంది క్రికెటర్లు కసరత్తులు చేస్తున్న వీడియోల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. శారీరక ఫిట్‌నెస్‌పై ప్రభావం ఉండకపోవచ్చు. అయితే మానసిక ఫిట్‌నెస్ అత్యంత కీలకం. మానసికంగా ఫిట్‌గా ఉండాలంటే ఆటకు దూరం కాకూడదు. క్రికెటర్లకు సెషన్ల వారీగా నెల రోజుల కార్యక్రమం ఉంటుంది. శారీరక ఫిట్‌నెస్‌తో పాటు నెట్స్.. వీడియో విశ్లేషణ అందులో భాగం. పాత వీడియోలు చూస్తూ ఆటలో లోపాల్ని సరిదిద్దుకోవడం.. మెరుగ్గా ఆడటం.. శైలిలో మార్పులు చేసుకోవడం.. కొత్త షాట్లు ఆడటం ఎప్పుడూ జరిగే కసరత్తే. ఇప్పటికీ వీటిని కొనసాగించొచ్చు. బ్యాటింగ్ డ్రిల్స్ చేసుకోవచ్చు. ఇంట్లోనే బంతిని నాకింగ్ చేయొచ్చు. చిన్నప్పుడు కారిడార్‌లో ఆడుతూనే పెరిగా. కొన్నిసార్లు లివింగ్ రూమ్‌లో బియ్యం బస్తాను స్టంప్స్‌గా అడ్డుపెట్టి అమ్మవాళ్లు విసిరే బంతుల్ని ఎదుర్కొనేవాడిని.
- నెల రోజులుగా ఇంట్లోనే ఉంటున్నారు. ఎలాంటి దినచర్యను పాటిస్తున్నారు?
మార్చి 15 నుంచి నేను ఇంట్లోనే ఉంటున్నా. 40 రోజులుగా ఇల్లు వీడలేదు. బయటి వాళ్లను ఎవరినీ కలవలేదు. అన్ని పనులూ మేమే చేసుకుంటున్నాం. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాం. నేను, అంజలి, సారా, అర్జున్ అందరం ఇంటి పనులు చేస్తున్నాం. బాధ్యతలు పంచుకుంటున్నాం. ప్రతి పనిని నేను ఆస్వాదిస్తున్నా. ఇల్లు తుడుస్తున్నా. పాత్రలు శుభ్రం చేస్తున్నా. వంట చేస్తున్నా. సొంతంగా జుట్టు కత్తిరించుకున్నా. అందరం కలిసి సినిమాలు, సీరియళ్లు చూస్తున్నాం. అమ్మతో చాలాసేపు మాట్లాడుతున్నా. అందరికి ఫోన్‌లో అందుబాటులో ఉంటున్నా. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ప్రతి ఒక్కరు లాక్‌డౌన్‌ను గౌరవించాలి. ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలి.
- సచిన్ అంటే క్రికెటర్‌గా అందరికీ తెలుసు. మాకు తెలియని తెందుల్కర్ గురించి చెబుతారా?
నా జీవితం తెరిచిన పుస్తకం. అందులో ప్రతి పేజీలోనూ క్రికెట్ అనే రాసుంటుంది. క్రికెట్ వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నా. నా వల్ల ఆటకు చెడ్డపేరు రావొద్దని ప్రతి క్షణం ఆలోచించే వ్యక్తిని. మైదానం బయట సాధారణ జీవితం నాది. పార్టీలకు.. ఫంక్షన్‌లకు పెద్దగా వెళ్లను. ఇంట్లోనే ఉండటం.. కుటుంబ సభ్యులతో గడపడం నాకిష్టం. నా జీవితంలో రహస్యాలేమీ లేవు.
ఎంత మార్పో..
నా చిన్నప్పటికీ ఇప్పటికీ క్రికెట్ ఎంతో మారింది. నిబంధనలు మారుతున్నకొద్దీ ఆట ఆడే ద్పక్పథం మారుతోంది. 30 అడుగుల ఆవల ఇద్దరు ఫీల్డర్లే ఉన్నప్పుడు బ్యాటింగ్ ద్పక్పథం భిన్నంగా ఉంటుంది. 1992, 1996, 1999 ప్రపంచకప్‌లు చూసుకుంటే 230, 240, 260 మంచి స్కోర్లు. ఇప్పుడు 260, 275 స్కోర్లను కాపాడుకునే పరిస్థితి లేదు. నిబంధనల మార్పుతో రెండు కొత్త బంతులు వచ్చాయి. బంతిపై మెరుపు తగ్గట్లేదు. పట్టుదొరకడం కష్టమవుతుంది. రివర్స్ స్వింగ్‌కు తక్కువ అవకాశం ఉంటుంది. ఫలితమే స్కోర్లలో వస్తున్న మార్పులు. 290, 300 స్కోర్లు సాధారణం. ఆ స్కోర్లను సులువుగా ఛేదిస్తున్నారు. టీ20ల రాకతో ఆట మరింత మారింది. బ్యాట్స్‌మెన్ కొత్తగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్త షాట్లు కనుగొంటున్నారు. భిన్నమైన షాట్లకు ప్రయత్నిస్తున్నారు. బౌలర్లు కూడా మారారు. బంతుల్లో వైవిధ్యం కనబరుస్తున్నారు. 1990ల్లో స్లో బౌన్సర్ ఊసేలేదు. ఇప్పుడు టీ20ల్లో అదే ప్రధానాయుధం.
భారత జట్టు భేష్