ఆస్ట్రేలియాలో కార్చిచ్చు బాధిత కుటుంబాల సహాయార్థం 'బుష్ఫైర్ క్రికెట్ బాష్' పేరిట ఓ మ్యాచ్ నిర్వహిస్తోంది ఆసీస్ క్రికెట్ బోర్డు. ఇందులో దిగ్గజ క్రికెటర్లు పాల్గొననున్నారు. భారత్ నుంచి సచిన్, యువరాజ్ ఆ దేశానికి వెళ్లారు. మాస్టర్.. రికీ పాంటింగ్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తుండగా.. గిల్‌క్రిస్ట్ జట్టులో ఆడనున్నాడు యువీ. ఇప్పటికే కంగారూ దేశంలో అడుగుపెట్టిన వీళ్లిద్దరూ.. తాజాగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సచిన్ అలనాటి తీపి స్మృతులను గుర్తుచేసుకున్నాడు.
బుష్ఫైర్ క్రికెట్ బాష్ జెర్సీలు ఈ మైదానంలో తనకు ఇష్టమైన కార్నర్లో కూర్చొని ఫొటోలు దిగాడు. మైదానం గ్యాలరీలోంచి కిందకు చూస్తూ పులకరించిపోయాడు. ఆ సమయంలో సచిన్ చిత్రాల్ని యువీ తన కెమెరాలో బంధించగా.. వాటిని అభిమానులతో పంచుకున్నాడు లిటిల్ మాస్టర్. బుష్ఫైర్ ఛారిటీ మ్యాచ్ మెల్బోర్న్ వేదికగాఆదివారం జరగనుంది.
సచిన్ పోస్టు చేసిన చిత్రాలు మార్కస్ నన్ను మైమరిపించాడు..
ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సచిన్.. ఆస్ట్రేలియా యువ క్రికెటర్ మార్కస్ లబుషేన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అప్పట్లో తన బ్యాటింగ్‌ను తనకు గుర్తుకుతెస్తున్నాడని చెప్పాడు. అంతేకాకుండా మార్కస్.. మంచి ప్రతిభ ఉన్న ఆటగాడని, ఫుట్‌వర్క్ సూపర్ అని కితాబిచ్చాడు మాస్టర్.
"లబుషేన్ ఫుట్‌వర్క్ అమోఘం. ప్రస్తుత ఆటగాళ్లతో నన్ను నాకే గుర్తుచేసిన క్రికెటర్. యాషెస్‌లో ఎదుర్కొన్న రెండో బంతికే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అతడికి దెబ్బతగిలింది. అయినా తట్టుకొని నిలబడి 15 నిమిషాలు బ్యాటింగ్ చేశాడు. ఆ సంఘటన చూశాక ఇతడిలో మంచి టాలెంట్ ఉందని అప్పుడే అనిపించింది. ఆలోచనల్లో స్థిరత్వం లేకపోతే అడుగు సరిగ్గా ముందుకు వేయలేం. కానీ ఫుట్‌వర్క్ విషయంలో పూర్తి పరిణతితో ఉన్నాడు ఈ క్రికెటర్. ఇవన్నీ చూస్తుంటే ఈ ఆటగాడు మానసికంగా చాలా బలంగా ఉన్నాడని అనిపిస్తోంది"
--సచిన్ తెందుల్కర్, దిగ్గజ క్రికెటర్
గతేడాది యాషెస్‌లో స్టీవ్ స్మిత్‌కు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వచ్చిన లబుషేన్.. ప్రస్తుతం ఆసీస్ జట్టులో స్టార్ ప్లేయర్‌గా ఎదిగాడు. అంతేకాకుండా 2019లో టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుడిగానూ నిలిచాడు.