టీమ్ఇండియా కెప్టెన్‌గా ఎవరిని నియమిస్తే బాగుంటుందని 2007లో బీసీసీఐ అడిగినప్పుడు.. తాను ధోనీ పేరు సూచించానని సచిన్ తెందుల్కర్ వెల్లడించారు. తొలి స్లిప్‌లో ఉండే తాను.. ధోనీలో మ్యాచ్‌ను అర్థం చేసుకునే నైపుణ్యాన్ని గమనించానని చెప్పారు. సచిన్, ద్రవిడ్, గంగూలీ కెప్టెన్సీకి దూరంగా ఉండి 2007 ప్రపంచకప్ కోసం కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే ఎవరిని కెప్టెన్‌ను చేస్తే బాగుంటుందని బీసీసీఐ.. సచిన్‌ను అడిగింది.
"అది ఎలా జరిగిందన్న వివరాల్లోకి నేను వెళ్లాలనుకోవట్లేదు. అయితే నన్ను అడిగినప్పుడు(బీసీసీఐలో సీనియర్లు) కెప్టెన్సీ గురించి నేను అనుకుంటున్నది చెప్పా. చిన్న చిన్న గాయాలు ఉండడం వల్ల నేను దక్షిణాఫ్రికా వెళ్లనని చెప్పా. అయితే అప్పట్లో నేను స్లిప్ వలయంలో ఉండేవాణ్ని. ఫీల్డింగ్ ఏర్పాటు తదితర అంశాల గురించి ఎంఎస్‌తో మాట్లాడుతూ అతడి ఆలోచనలు అర్థం చేసుకునేవాణ్ని. అతడు మ్యాచ్‌ను అర్థం చేసుకునే తీరును దగ్గరగా గమనించా. ధోనీకి మంచి క్రికెట్ బుర్ర ఉందని అర్థమైంది. బోర్డుకు అదే విషయం చెప్పా. ధోనీనే తర్వాతి కెప్టెన్‌ను చేయాలని సూచించా"
-- సచిన్ తెందుల్కర్, భారత దిగ్గజ క్రికెటర్