దిగ్గజ సచిన్ తెందుల్కర్ తన క్రికెట్ గురువు రమాకాంత్ అచ్రేకర్‌ను తరచూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. అచ్రేకర్ జయంతి సందర్భంగా సచిన్ గురువారం మరోసారి ఆయనను స్మరించుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
గురువు ఆచ్రేకర్పై సచిన్ ఎమోషనల్ ట్వీట్ - సచిన్ వార్తలు
తన క్రికెట్ గురువు ఆచ్రేకర్ జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకున్న సచిన్.. భావోద్వోగ ట్వీట్ చేశారు. దానితో పాటే గురువు ఆధ్వర్యంలో ప్రాక్టీసు చేస్తున్న పాత ఫొటోను పోస్ట్ చేశారు.
'నా మనసుకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి గురించి ఆలోచిస్తున్నా. నాతో సహా, ఎంతోమంది యువ క్రికెటర్లు తమలో ఉన్న శక్తిసామర్థ్యాలను ఆటకు ఉన్న శక్తి ద్వారా గుర్తించడానికి ఆయన సాయపడ్డారు. దీనంతటికీ ధన్యవాదాలు, అచ్రేకర్ సర్' అని సచిన్ ట్వీట్ చేశారు. తన చిన్నతనంలో గురువు అచ్రేకర్ క్రికెట్ ప్రాక్టీస్ చేయిస్తున్న ఫొటోను జత చేశారు.
ఈ ఏడాది జనవరిలోనూ అచ్రేకర్ వర్ధంతి సందర్భంగా సచిన్ ట్వీట్ చేశారు. తన క్రికెట్ కెరీర్ ఆరంభంలో ఆటకు సంబంధించి ఏబీసీడీలు ఆయన వద్దే నేర్చుకున్నట్లు తెలిపారు. తన క్రికెట్ జీవితంలో ఆయన భాగస్వామ్యాన్ని మాటల్లో చెప్పలేనిదిగా సచిన్ వర్ణించారు. అచ్రేకర్ నిర్మించిన పునాదులపైనే తాను నిలబడినట్లు మాస్టర్ పేర్కొన్నారు. గతేడాది జనవరి 2న అనారోగ్య సమస్యలతో అచ్రేకర్(87) కన్నుమూశారు.