తెలంగాణ

telangana

ETV Bharat / sports

సచిన్​ గురించి ఆసక్తికరమైన విషయాలు...! - birth day

సచిన్ తెందుల్కర్.. ఈ పేరు వింటే సగటు క్రికెట్ అభిమాని ఉప్పొంగిపోతాడు. అతడు మైదానంలో అడుగుపెడుతుంటే సచిన్ పేరుతో స్టేడియం హోరెత్తుతుంది. అంతగా అభిమానులు.. తమ గుండెల్లో చెరగని ముద్ర వేసిన మాస్టర్​ బ్లాస్టర్ పుట్టినరోజు నేడు. 1973 ఏప్రిల్ 24న జన్మించిన సచిన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూడండి!

సచిన్​ పుట్టినరోజు ప్రత్యేకం

By

Published : Apr 24, 2019, 6:31 AM IST

Updated : Apr 24, 2019, 9:09 AM IST

సచిన్ తెందుల్కర్ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్​ పాకిస్థాన్​ తరఫున ఆడాడని మీకు తెలుసా! అఫ్రిదీ.. మాస్టర్​ బ్యాట్​తోనే రికార్డు సెంచరీ చేశాడు. థర్డ్​ అంపైర్​ ఔటిచ్చిన తొలి బ్యాట్స్​మెన్ సచినే.. ఇలాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం! నేడు మాస్టర్​బ్లాస్టర్ పుట్టినరోజు సందర్భంగా వీటిపై ఓ లుక్కేయండి.

పాకిస్థాన్ తరఫున తొలి అంతర్జాతీయ మ్యాచ్​!

1989లో పాక్​తో సచిన్ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్​ ఆడాడని అందరికీ తెలుసు. కానీ అంతకంటే ముందు 1987లో ఇండియా - పాకిస్థాన్ మధ్య జరిగిన ఓ ఎగ్జిబిషన్​ మ్యాచ్​లో సచిన్​ ఆడాడు. కానీ.. పాక్​ తరఫున. అయితే.. అది సబ్​స్టిట్యూట్​ ఫీల్డర్​గానే. ఈ విషయాన్ని సచిన్ తన పుస్తకం 'ప్లేయింగ్​ ఇట్ మై వే' లో తెలిపాడు.

థర్డ్​ అంపైర్​ ఔటిచ్చిన తొలి బ్యాట్స్​మెన్ సచినే..

1992లో దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్​లో సచిన్​ ఔట్​ను థర్డ్ అంపైర్ ఇచ్చాడు. క్రీజులో సచిన్, రవిశాస్త్రి ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్ మెక్​మిలన్​ బౌలింగ్​లో సచిన్​ రిస్కీ సింగిల్​ కోసం ప్రయత్నించగా.. రవిశాస్త్రి వద్దని వెనక్కి పంపాడు. ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్ అవకాశం కోసం స్టంప్స్​ దగ్గర వేచి ఉన్నాడు. ఆండ్రూ హడ్సన్ బంతిని రోడ్స్​కు విసిరాడు. వెంటనే స్టంప్స్​ను గిరాటేశాడు జాంటీ. లెగ్​ అంపైర్ సైరిల్​ అనుమానంతో థర్డ్​ అంపైర్​కి సిఫార్సు చేశాడు. థర్డ్​ అంపైర్ కార్ల్​ లియన్ బర్గ్ ఆధునిక సాంకేతికత సాయంతో సచిన్​ని ఔట్​గా తేల్చాడు. అప్పటివరకు అంపైర్లే రనౌట్ ఇచ్చేవాళ్లు. సాంకేతిక పరిజ్ఞానం రాకతో రనౌట్​ను థర్డ్ అంపైర్​కు నివేదిస్తున్నారు.

సచిన్​ బ్యాట్​తో రికార్డు సెంచరీ చేసిన అఫ్రిదీ..

మొన్నటి వరకు ప్రపంచంలో వేగవంతమైన శతకం చేసింది ఎవరంటే షాహిద్​ అఫ్రిదీ అని టక్కున చెప్పేస్తారు. కానీ సచిన్ తెందుల్కర్ బ్యాట్​తో షాహిద్ ఆ సెంచరీ చేశాడు. 1996లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో షాహిద్ 37 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. అప్పుడే జట్టులోకి వచ్చిన అఫ్రిదీకి క్రికెట్ కిట్ కూడా లేదు. పాక్ స్పిన్నర్ ముస్తాక్ బూట్లు, హెల్మెట్​ షాహిద్​కివ్వగా.. వకార్​ యూనిస్ నెట్​ ప్రాక్టీస్ సమయంలో బ్యాట్ ఇచ్చాడు. అనంతరం సచిన్​ ఇచ్చిన బ్యాట్​తో 'శత'క్కొట్టాడు. తర్వాత ఈ విషయాన్ని అఫ్రిదీయే స్వయంగా చెప్పాడు.

సెంచరీ చేసినా సంబురం చేసుకోలేదు..

సాధారణంగా శతకాలు చేసినపుడు బ్యాట్స్​మెన్ సంబురాలు చేసుకోవడం మనం చూసే ఉంటాం. మైదానంలోనే కాకుండా బయట కూడా వేడుకలా చేసుకుంటారు. అలాగే 1990లో ఇంగ్లండ్​పై సచిన్ తన తొలి టెస్టు సెంచరీ చేశాడు. మ్యాగ్నమ్ షాంపైన్​ బాటిల్ బహుమతిగా పొందాడు. కానీ బ్రిటీష్​ నిబంధనల ప్రకారం 18 ఏళ్ల లోపు వారు ఆల్కహాల్ సేవించకూడదు. ఈ కారణంగా తన తొలి సెంచరీ ఆనందాన్ని ఆస్వాదించలేకపోయాడు సచిన్. అప్పటికీ తన వయసు 17ఏళ్లే.

Last Updated : Apr 24, 2019, 9:09 AM IST

ABOUT THE AUTHOR

...view details