మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్‌ను అభిమానులు.. క్రికెట్ దేవుడుగా ఆరాధిస్తారు. క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అలాంటి దిగ్గజ క్రికెటర్ కూడా తన తొలి సెలక్షన్లో ఎంపిక కాలేదట. ఆ సమయంలో చాలా బాధపడినట్లు చెప్పుకొచ్చాడు లిటిల్ మాస్టర్. శుక్రవారం.. మహరాష్ట్రలోని ఓ పాఠశాల విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సచిన్.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
"ముంబయి జట్టులో చోటు కోసం తొలిసారి ట్రయల్స్‌కు వెళ్లినప్పుడు నన్ను ఎంపిక చేయలేదు. అప్పుడు చాలా బాధపడ్డాను. ఆటపై దృష్టిపెట్టాలని సెలక్టర్లు సూచించారు. నిజానికి నేను బాగా బ్యాటింగ్ చేయగలనని తెలుసు. కాని నేను అనుకున్నట్లు ఫలితం రాలేదు. అందుకే నిరుత్సాహపడకుండా విపరీతమైన సాధన చేసి నన్ను బాగా మెరుగుపర్చుకున్నా. మీరూ మీ లక్ష్యాలు సాధించేందుకు కష్టపడండి. మంచి ఫలితాలు రావాలంటే దగ్గర దారులు పనిచేయవు"
-- సచిన్ తెందూల్కర్, దిగ్గజ క్రికెటర్