కరోనా వైరస్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని రక్షించేందుకు ఆ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ పిలుపునిచ్చారు. బృహన్ ముంబయి కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం అంథేరిలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ కేంద్రం ప్రారంభించిన బ్యాటింగ్ దిగ్గజం ఈ సందర్భంగా వైద్యాధికారుల సేవలను కొనియాడారు.
"కొవిడ్-19 కారణంగా మనమంతా ఇప్పుడు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఈ సందర్భంగా వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు వైరస్ సోకిన వారిని కాపాడటానికి నిరంతరాయంగా పనిచేస్తున్నారు. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ మహమ్మారికి మందు కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే విషమ పరిస్థితుల్లో ఉన్న వారికి ప్లాస్మా థెరపీ చికిత్స అందిస్తే వారు కోలుకునే అవకాశం ఉంది. ఈ సేవలను ప్రారంభించిన బీఎంసీ అధికారులకు అభినందనలు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయండి. తద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారు కోలుకుంటారు."