మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా మరోసారి బ్యాట్ పట్టాడు. క్రీడల ప్రాముఖ్యతను వివరించేందుకు, వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గురువారం.. ముంబయిలోని ఓ గల్లీలో క్రికెట్ ఆడాడు.
బాలీవుడ్ హీరోలు వరుణ్ ధావన్, అభిషేక్ బచ్చన్.. సచిన్‌తో కలిసి క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశాడు లిటిల్ మాస్టర్.
" మేం క్రికెట్ ఆడాలనుకుంటున్నాం.. నువ్వు మాతో చేరుతావా?" అని సచిన్ అడగ్గా వెంటనే వరుణ్ అంగీకరించాడు. మొదట వరుణ్, తర్వాత జూనియర్ బచ్చన్ బౌలింగ్ చేశారు. జియా అనే అమ్మాయి బౌలింగ్‌ను మెచ్చుకున్న సచిన్... వరుణ్ బ్యాటింగ్ చేస్తుండగా ఆమెకు బంతి అప్పగించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.