ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ కరోనా వ్యాప్తి కారణంగా ఇటీవలే రద్దయింది. ఈ నేపథ్యంలో సఫారీలు పాకిస్థాన్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత తొలిసారి పాక్‌లో ఆడేందుకు సౌతాఫ్రికా ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారని పాక్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
"ఈ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు టీ20లలో పాకిస్థాన్ తలపడనుంది. టెస్టు సిరీస్ మొదటి మ్యాచ్ జనవరి 26 నుంచి 30 వరకు జరగనున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు జనవరి 16న కరాచీ చేరుకుంటారు. తర్వాత మిగతా మ్యాచ్‌ల నిర్వహణ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు వెళ్తారు."
- పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.
టెస్టు సిరీస్ తర్వాత ఫిబ్రవరి 11, 13, 14 తేదీల్లో టీ-20 సిరీస్ నిర్వహించనున్నట్లు పాక్ బోర్డు వెల్లడించింది. దక్షిణాఫ్రికా జట్టు చివరిసారిగా 2007లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లింది. ఆ సిరీస్‌లో 1-0తో సిరీస్ కైవసం చేసుకుంది. 1995 నుంచి ఇప్పటివరకు ఇరుజట్లు కలిపి 11 టెస్టు సిరీస్‌లు ఆడాయి. ఇందులో సఫారీలు 7 గెలవగా పాక్ ఒక్కదాంట్లోనే నెగ్గింది.
"దక్షిణాఫ్రికా జట్టు పాక్ పర్యటనకు రావడం ఆనందంగా ఉంది. పాకిస్థాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నా. ఇటీవలే పాకిస్థాన్ సూపర్ లీగ్ టైటిల్ గెలిచాం. ఈ ధీమాతో సొంత గ్రౌండ్లో సఫారీలతో తలపడేందుకు సన్నద్దమవుతున్నాం"
-బాబర్ అజామ్, పాకిస్థాన్ కెప్టెన్.
పాకిస్థాన్‌లో సఫారీల పర్యటన వివరాలు..