తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధోనీతో మాట్లాడాకే బ్యాటింగ్​లో రెచ్చిపోయా!' - ధోనీ వార్తలు

గతేడాది జరిగిన ఐపీఎల్​లో తాను బ్యాటింగ్​లో రాణించడానికి కారణం కెప్టెన్ ధోనీ అని అంటున్నాడు సీఎస్​కే బ్యాట్స్​మన్​ రుతురాజ్​ గైక్వాడ్​. ధోనీతో మాట్లాడిన తర్వాతే తాను స్వేచ్ఛగా బ్యాటింగ్​ చేశానని వెల్లడించాడు.

Ruturaj Gaikwad
రుతురాజ్​ గైక్వాడ్​, ధోనీ

By

Published : Mar 28, 2021, 7:56 AM IST

కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ మాట సాయం వల్లే గతేడాది ఐపీఎల్‌ ఆఖర్లో రాణించానని సీఎస్‌కే యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అంటున్నాడు. మహీతో మాట్లాడాకే తాను స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేశానని పేర్కొన్నాడు.

"ఫలితం గురించి ఆలోచించకుండా ఆటను ఆస్వాదించాలని ధోనీ నాతో చెప్పాడు. వాతావరణాన్ని ఆనందించాలని సూచించాడు. ప్రశాంతంగా ఉండాలన్నాడు. నాపై ధోనీ ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని తెలిశాక నేను బాగా ఆడాను. మళ్లీ అదే నాకిప్పుడు గుర్తుకొస్తోంది. ఎందుకంటే నేనెప్పుడూ ఫలితాన్నే చూసేవాడిని. ప్రక్రియ గురించి ఆలోచించే వాడిని కాదు. అందుకే ధోనీ మాటలు నాకు సాయం చేశాయి."

- రుతురాజ్​ గైక్వాడ్​, చెన్నై సూపర్​కింగ్స్​ బ్యాట్స్​మన్​

ప్రస్తుత సీజన్‌ గురించి తాను ఒత్తిడి చెందడం లేదని గైక్వాడ్‌ తెలిపాడు. సీఎస్‌కేలో ప్రక్రియే అత్యంత ముఖ్యమన్నాడు. "సీఎస్‌కేలో నేనుండే వాతావరణం ఫలితాలపై కాకుండా ప్రక్రియపై దృష్టి పెడుతుంది. నేనా ప్రక్రియను ఆస్వాదించాలని అనుకుంటున్నా. వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేయాలని భావిస్తున్నా" అని అతడు వెల్లడించాడు.

ఈ సీజన్‌కు ముందు తనకు ధోనీతో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు. "నేను ధోనీ నుంచి నేర్చుకున్న ముఖ్యమైన పాఠం ఏంటంటే.. జీవితంలో లాగే క్రికెట్లోనూ మంచి, చెడ్డ రోజులు ఉంటాయి. నీ పట్ల నువ్వెంత నిజాయతీగా ఉన్నావన్నదే ముఖ్యం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తటస్థంగా ఉండాలి. ప్రతిరోజూ మనది కాదన్న సత్యాన్ని అంగీకరించాలి. కుదిరిన ప్రతి రోజునూ అందంగా మలుచుకోవాలి" అని రుతురాజ్‌ చెప్పాడు.

గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో ధోనీసేన ఘోర పరాభవాలు ఎదుర్కొంది. టోర్నీ చరిత్రలో తొలిసారి ప్లేఆఫ్స్‌కు చేరుకోకుండా వెనుదిరిగింది. ఓపెనర్‌ రుతురాజ్‌ మొదట్లో కరోనా బారిన పడ్డాడు. తొలుత ఆడిన మూడు మ్యాచుల్లో విఫలమయ్యాడు. అయితే ఆఖర్లో బెంగళూరుపై 65*, కోల్‌కతాపై 72, పంజాబ్‌పై 62* పరుగులతో రెచ్చిపోయాడు.

ఇదీ చూడండి:ఒక్క ఓవరూ కష్టమేనా?.. సెహ్వాగ్​ సూటిప్రశ్న

ABOUT THE AUTHOR

...view details