ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతోన్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ విఫలమైనా.. పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అర్ధసెంచరీతో అలరించాడు. ఈ క్రమంలో బుమ్రా.. కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. ఆ బంతి పొరపాటున గ్రీన్ తలకు బలంగా తాకింది. ఫలితంగా నొప్పితో విలవిల్లాడిన గ్రీన్ పిచ్‌లోనే కూలబడ్డాడు. దీంతో నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న మహ్మద్ సిరాజ్ తన బ్యాట్‌ను పడేసి పరుగు పూర్తి చేయకుండా అతని వద్దకు పరిగెత్తాడు. అంపైర్ వెంటనే ఫిజియోను రప్పించడం వల్ల మైదానంలో కాసేపు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే అదృష్టవశాత్తు గ్రీన్‌కు పెద్ద గాయం కాకపోవడం వల్ల ఓవర్‌ను పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సబ్‌స్టిట్యూట్‌గా పాట్ రో
అయితే ఈ గాయం తర్వాత కామెరూన్ గ్రీన్ స్థానంలో పాట్ రో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా క్రికెట్ ఆస్ట్రేలియా బరిలో దించింది. గ్రీన్ ప్రస్తుతం వైద్యల పర్యవేక్షణలో ఉన్నాడని.. శనివారం అతని ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇస్తామని సీఏ పేర్కొంది.